అధిక సాంద్రత పత్తి సాగులో న్యూమాటిక్ ప్లాంటర్‌తో విత్తనాల విత్తకం ప్రదర్శన
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన రైతు మొగిలి పొలంలో శనివారం అధిక సాంద్రత పత్తి సాగులో న్యూమాటిక్ ప్లాంటర్ ద్వారా పత్తి విత్తనాల విత్తకం ప్రదర్శన కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే బెల్లంపల్లి పంట ఉత్పత్తి శాస్త్రవేత్త డా. ఎన్. మహేష్ రైతులకు అధిక సాంద్రత పత్తి సాగు ప్రాముఖ్యత, ప్రయోజనాలను వివరించారు. ఈ విధానంలో సరైన మొక్కల సాంద్రత, నీరు ఎరువుల సమర్థ వినియోగం, కలుపు నివారణ సౌలభ్యం, అధిక దిగుబడులు సాధించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ కూలీల కొరత తీవ్రంగా ఉన్నందున యాంత్రీకరణను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. న్యూమాటిక్ ప్లాంటర్ ద్వారా ఒక ఎకరం విస్తీర్ణంలో విత్తనాల విత్తకం కేవలం 50 నిమిషాల్లో పూర్తవుతుందనిన్నారు. దీంతో సమయం, శ్రమ వ్యయం గణనీయంగా తగ్గుతాయని వివరించారు.
ఈ యంత్రం ద్వారా విత్తనాలు సమాన దూరంలో, సరైన లోతులో పడటంతో మొక్కల ఎదుగుదల ఏకరీతిగా ఉండి మంచి దిగుబడులు పొందవచ్చన్నారు. అలాగే అధిక సాంద్రత పత్తి సాగుకు అనువైన హైబ్రిడ్లు, వరుసల మధ్య మొక్కల మధ్య పాటించాల్సిన దూరం, సమతుల్య ఎరువుల వినియోగం, నేల సారాన్ని మెరుగుపరచే చర్యలు, సమగ్ర పంట యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. సమతుల్య ఎరువుల వినియోగం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడి స్థిరమైన పత్తి ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలిపారు.






