25 April, 2026 | 4:47 PM

సమర్థుడైన నాయకుడే శ్రీరామరక్ష

05-03-2025 12:00 AM

అర్థ ఏవ ప్రధాన ఇతి కౌటిల్యః 

అర్థమూలౌహి ధర్మకామావితి

 కౌటిలీయం: -(1-

“అర్థమే (సంపద) ప్రధానం. ఎందుకంటే, ధర్మకామాలు రెండింటికీ అర్థమే మూలం” అంటాడు చాణక్య. ప్రతి వ్యక్తీ సుఖంగా జీవించాలని కోరుకుంటాడు. దానికి అవసరమైన అర్థిక వనరులు సమకూర్చుకోగలిగితేనే ధర్మమార్గంలో జీవిం చడం, కామ్యాలను అనుభవించడం సా ధ్యమవుతుంది. సంపదను గడించేందుకు ఉద్యోగాలు, వ్యాపారాదులు నిర్వహించ డం, అవసరమైన నైపుణ్యాలతో సేవలందించడం వంటివి ఉపయుక్తమవుతాయి. సంపదను సృష్టించడం, దానిని సద్వినియోగం చేయడం లక్ష్యంగా ఔత్సాహికులై న కొందరు వ్యక్తులు వ్యాపార సంస్థలను నెలకొల్పి, వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు.

అలాంటి సంస్థలు నిలిస్తేనే ఎం దరికో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వానికీ పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. పారిశ్రామిక వేత్త లు అర్హత ప్రాతిపదికగా ఉద్యోగులను ఎన్నుకొని, ఉత్పత్తులు సాధించి వాటిని సమర్థ వంతంగా పంపిణీ చేస్తారు. తద్వారా తా ము అభ్యుదయాన్ని పొందడమే కాక ఉద్యోగులను, వినియోగదారులనూ సం తృప్తి పరుస్తారు. ఈ రకంగా జాతీయ సం దను పెరగడానికి దోహద పడతారు.

కారణాలేవైనా, ఒక్కోసారి సంస్థలు నష్టాల పాలబడి ఉనికిని కోల్పోతాయి. దాంతో ఆ ఉద్యోగాలను నమ్ముకున్న వా రు వీధిన పడతారు. సమర్థుడైన నాయకుడు సంస్థకు లభిస్తే ఉత్తమ ఫలితాలను రాబట్టడమే కాక పునర్వైభవాన్నికూడా తీసుకు రాగలుగుతారు. సాధారణంగా లాభాలలో ఉన్న సంస్థను ఉన్నత స్థితికి తీసుకు వెళ్ళడం సులువే. కాని, ఆర్థిక నష్టాలలో చిక్కుకున్న వేళ దానిని గట్టెక్కించడం అత్యంత సంక్లిష్టం. ఓవైపు సమర్థులైన ఉద్యోగులూ వెళ్ళిపోతారు. కొనుగోలుదారులూ పోటీదారులవైపు జారతారు. కొత్త అప్పులు పుట్టవు. ఇలాంటి కష్టసమయం లో నష్టాల బారిన పడిన సంస్థను ముం దుకు నడపడం నాయకుని ప్రతిభా విశేషాలపై ఆధారపడి ఉంటుంది. వాటిని లా భాల బాటలో నడిపించగలిగిన నాయకు డే అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాడు. ఉదా॥కు కొన్ని సంస్థల స్థితిగతులు పరిశీలిద్దాం.

విజయాల వెనుక ఎందరో..

ఐబీఎం సంస్థ 1990 వరకు ఆర్థికంగా పలు ఇబ్బందులలో చిక్కుకున్నప్పటికీ సమర్థుడైన గెర్ స్ట్నర్ నాయకుడయ్యాక ఉదాత్త పరివర్తన సాధించింది. సేవలు, సృజనాత్మకత, కంప్యూటర్ల విని యోగం వంటివాటిపై ఆయన దృష్టి పెట్టడంతో ఉత్తమ ఫలితాలతో ముందుకు సాగుతున్నది. అలాగే, యాపిల్ సంస్థ 1990 వర కు నష్టాలను చవి చూసిందే. స్టీవ్ జాబ్స్ దానికి నాయకుడయ్యాక దానిలో మా ర్పు ఆరంభమైంది. సృజనా త్మకత, కొత్త నమూనాలను ఆవిష్కరించడం, వినియోగదారుల అనుభవాలకు, సూచనలకు ప్రాధాన్యం ఇయ్యడం వంటివాటివల్ల ఆ సంస్థ రూపురేఖలే మారిపోయాయి. ఇవాళ యాపిల్ తయారుచేసే ఐపాడ్, ఐఫోన్ వంటివి అనూహ్యమైన అమ్మకాలను సాధించి సంస్థకు అమిత లాభాలను ఆర్జించి పెడుతున్నాయి. యాపిల్ సంస్థ బ్రాండు గుర్తింపు విపణి వీధిలో ఉన్నత శిఖరాలను చేరుకున్నది.

డెల్ సంస్థ కూడా 2000 వరకు అత్యధిక నష్టాలను చవిచూచిందే. ఎప్పుడైతే మైఖల్ డెల్ నాయకునిగా సంస్థ పగ్గాలు చేపట్టాడో, అప్పట్నుంచీ అందులోనూ పెనుమార్పులు చోటుచే సుకున్నాయి. పునర్నిర్మాణం జరిగింది. ముఖ్యం గా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడం, సృజనాత్మకతకు పెద్దపీట వేయడం, వినియోగ దారుల సేవల విషయంలో శ్రద్ధ తీసుకోవడం వంటివాటివల్ల సంస్థ లాభాలు ఆర్జించసాగింది. ఈరోజు ఉన్నతశ్రేణి సాం కేతికతను ఆదరిస్తున్న పరిశ్రమగా రాణి స్తూ పోటీసంస్థల మధ్య గణనీయమైన స్థానాన్ని పొందింది. బొగ్గును వెలికి తీసే సింగరేణి 1998 వరకు దాదాపు 1,298 కోట్ల నష్టాల లో రెండుమార్లు బీఐఎఫ్‌ఆర్ (పరిశ్రమలు, ఆర్థిక పునర్నిర్మాణ బోర్డ్) వరకూ వెళ్లి, దివాలా తీసే స్థితికి చేరింది.

నాయకునిగా ఏపీవీఎన్ శర్మ బాధ్యతలు చేపట్టాక యాజమాన్య కార్మిక సంబంధాలపై దృష్టిని కేంద్రీకరించారు. పటిష్టమైన దార్శనికతా పత్రాన్ని (విజన్ స్టేట్‌మెంట్), ప్రణాళికాబద్ధ పత్రాన్ని (మిషన్ స్టేట్‌మెంట్) తయారు చేసుకోవడం, భద్రతా రంగంలో అవసరమైన శిక్షణను అందించి కార్మికులను భాగస్వామ్యులను చేయడం, కంప్యూటర్ వ్యవస్థను పటిష్టం చేస్తూ సృజనాత్మకతను ప్రోత్సహించడం, వివిధ విభాగాలను సమన్వయం చేస్తూ అవసరమైన సమా చారాన్ని అందుబాటులోకి తెచ్చుకోవడం, పారదర్శకత, సంక్షేమ పథకాలను అమలు, వ్యయ నియంత్రణపై వంటివాటిపై దృష్టి పెట్టడంతో అత్యధిక లాభాలను సాధించింది. మరోవైపు అత్యధిక ఉత్పత్తినీ అందిస్తున్నది.

పలు రాష్ట్రాల విద్యుత్ అవసరాలను తీరుస్తున్నది. ఇవేకాక, టాటా స్టీల్స్, సెయిల్, భారత రైల్వేస్ లాంటి సంస్థలు కూడా నష్టాల ఊబినుం డి బయటపడి ఉన్నత ఫలితాలను ఆవిష్కరిస్తున్నాయి. వీటి విజయయాత్రలో ప్రభావవంతమైన నాయకత్వం, ప్రతి భావంతులైన ఉద్యోగుల అంకితభావం, సమన్వ యంతో కూడిన బాధ్యతాయుత పనితీరు, వ్యూ హాత్మకమైన ప్రణాళికలు, పరివర్తనను మనఃస్ఫూర్తిగా కోరుకోవడం, నాణ్య తా ప్రమాణాలను పాటించడం, జవాబుదారీతనం, నిబద్ధత వంటి లక్షణాలను ఆదరించడం వల్ల చక్కని ఫలితాలను సాధించగలిగాయి.

సముద్రంలో అలలు పడినా తిరిగిలేస్తాయి. సంస్థ తన అపజయాన్ని సమీక్షిం చుకొని పునర్నిర్మాణం చేసుకుంటే నిలదొక్కుకుంటుంది. సంస్థ నిలిస్తేనే ఉద్యోగుల కు ఉపాధి, ప్రభుత్వాలకు పన్నుల రూపం లో ఆదాయం లభిస్తాయి. వినియోగదారులు, ప్రభుత్వం, ఉద్యోగులూ, యాజ మాన్యం ఈ నాలుగు వ్యవస్థలూ నాలుగు స్తంభాలుగా నిలబడిన వ్యాపార భవనం అద్భుత విజయాల దిశగా సాగుతుంది.

- పాలకుర్తి రామమూర్తి