calender_icon.png 30 May, 2025 | 11:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ సినిమా భశుం!

07-05-2025 12:00:00 AM

అమెరికాలో విదేశీ చిత్రాల ప్రదర్శన ఆ దేశ భద్రతకే ముప్పు అని అధ్యక్షుడు ట్రంప్ భావించారు. అందుకే విదేశాల్లో నిర్మించిన చలనచిత్రాలపై వందశాతం సుంకం విధించాలని ఆదేశించారు. అమెరికాలో చిత్ర పరిశ్రమ చాలా వేగంగా మరణశయ్యకు చేరుతున్నదని కూడా ట్రంప్ భావన. ఇందులో నిజం లేకపోలేదు. హాలివుడ్ ప్రాభవం తగ్గిపోతున్నది. అమెరికా చిత్రాలు, టీవీ షోలలో 20 శాతం మాత్రమే ఇప్పుడు హాలివుడ్‌లో నిర్మిస్తున్నారు.

అమెరికాలో మహామహులనుకొనే వారి చిత్రాలు కూడా తరచుగా ఫ్లాప్ అవుతున్నాయి. అమెరికాలో హాలివుడ్‌కు దీటుగా అట్లాంటా, న్యూయార్క్, టెక్సాస్ చిత్ర నిర్మాణంలో దూసుకెళుతున్నాయి. యూరప్, ఆస్ట్రేలియా, కెనడా తక్కువ వ్యయంతో తమ దేశాల్లో చిత్ర నిర్మాణం పూర్తి చేసుకోవచ్చునని అమెరికా చిత్ర నిర్మాణ సంస్థలకు గాలం వేస్తున్నాయి.

అమెరికా చిత్ర నిర్మాణం బయటి దేశాలకు వెళుతుంటే జరిగే నష్టాన్ని పూరించుకునేందుకు విదేశీ చిత్రాలపై అమెరికా వందశాతం సుంకం విధించడమే పరిష్కారమని చాలా సులువైన సూత్రాన్ని ట్రంప్ కనుగొన్నారు. మరి, ఇతర దేశాలు కూడా అమెరికాలో నిర్మించిన చిత్రాలపై తమ దేశాల్లో సుంకం విధిస్తే అది అమెరికాకు పెద్ద దెబ్బ. ప్రపంచ స్థాయిలో అమెరికా చిత్రాలను కాదని ఇతర దేశాల చిత్రాలు బాక్సాఫీసును కొల్లగొట్టడం చాలా అరుదు.

2020లో చైనా యానిమేషన్ చిత్రం ‘నీ జా 2’ బాక్సాఫీసువద్ద పెద్ద సంచలనంగా నిలిచింది. 2 బిలియన్ అమెరికా డాలర్లను కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇలాంటి చిత్రాల విజయాన్ని దృష్టిలో పెట్టుకొని హాలివుడ్‌ను పెద్దగా, దృఢంగా చేస్తానని చెప్పారు. 

ఇప్పుడు సుంకం నిర్ణయంతో అమెరికా చిత్ర పరిశ్రమ ఏమవుతుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే, ఒక అమెరికా చిత్రం బయటి దేశాల్లో కొంతభాగం షూటింగ్ జరుపుకున్నదనుకుందాం, అప్పుడది అమెరికా చిత్రమేనా, లేదూ విదేశీ చిత్రమా? ట్రంప్ సుంకం వర్తిస్తుందా, వర్తించదా.. స్పష్టత లేదు. హాలివుడ్ ఇప్పుడు తన రెవెన్యూలో మూటింట రెండు వంతులు విదేశాల నుంచే ఆర్జిస్తున్నది.

‘అవతార్’ చిత్రానికి రెవెన్యూ 73 శాతం విదేశాల నుంచి వచ్చిందే. ‘అవతార్’తోపాటు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు రికార్డులు తిరగరాసిన ‘టైటానిక్’ సినిమా రెవెన్యూ కూడా విదేశాల నుంచే ఎక్కువ వచ్చింది. జేమ్స్ కెమెరాన్ అమెరికా దేశస్థుడు కాదు. ఆయన కెనడా పౌరుడు. ఇప్పుడు వందశాతం సుంకం భరించి అమెరికా డిస్ట్రిబ్యూటర్లు విదేశీ చిత్రాలను ప్రదర్శిస్తే, వారికి మిగిలేదేమిటి?

చాలా ఏళ్లుగా హిందీ, తెలుగు చిత్రాలకు అమెరికాలో గిరాకీ ఎక్కువ. లక్షలకొద్ది డాలర్లు మన చిత్రాలకు అమెరికాలో విడుదలతోనే వస్తుంటాయి. విదేశీ చిత్రాలు అని ట్రంప్ తన టారిఫ్‌ల విధానంలా చిత్ర పరిశ్రమను కూడా అదే గాటన కడితే ప్రయోజనం ఎవరికి? మేధోసంపత్తి కిందికి వచ్చే చిత్ర నిర్మాణంపై సుంకాలు విధించడం సబబేనా, సర్వీసుల రంగంపై కూడా ట్రంప్ సుంకాలు విధిస్తారా? అనేవి జవాబు లేని ప్రశ్నలు.