యుద్ధం చేయబోమని ట్రంప్ హామీ ఇవ్వాలి
అప్పటి వరకు కాల్పులను ఆపబోమన్న ఇరాన్
దాడుల నిలిపివేతకు అమెరికా సిద్ధంగా లేదు
శత్రు నౌకలకే హోర్ముజ్ నో ఎంట్రీ : మంత్రి అబ్బాస్
టెహ్రాన్, మార్చి 21: ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం 22వ రోజుకు చేరుకుంది. ఇరాన్‌పై సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. దీనిపై తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పందించారు. కాల్పులను ఆపేందుకు తాము అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. గత అనుభవాలు పునరావృతం కావాలని తాము కోరుకోవడం లేదన్నారు.
యుద్ధం ముగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము వినడానికి, పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం కొన్ని దేశాలు పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాయని, దాడులను నిలిపివేసేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదని, దీంతో తాము మా దేశాన్ని కాపాడుకునేందుకు యుద్ధం కొనసాగిస్తూనే ఉంటామని అబ్బాస్ అరాగ్చి తెలిపారు. యుద్ధానికి ముగింపు అంటూ జరిగితే అది పూర్తిగా, ఎప్పటికీ యుద్ధానికి దిగకుండా ఉంటామనే హామీ రూపంలో ఉండాలని డిమాండ్ చేశారు. ఇరాన్‌కు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేశారు.
కేవలం దేశ పరిరక్షణ కోసమే ఇరాన్ యుద్ధం సాగిస్తోందని చెప్పారు. వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధిని మూసివేయడంపై అబ్బాస్ అరాగ్చి మాట్లాడుతూ, శత్రుదేశాల నౌకలకు మాత్రమే ఆ మార్గం మూసేశామని చెప్పారు. అమెరికా దాడులకు స్పందనగా మార్చి 2న హోర్ముజ్‌ను ఇరాన్ బంద్ చేసింది. దీంతో ఇంధన సరఫరాపై ప్రపంచ దేశాల్లో ఆందోళన నెలకొంది. ఇటు ఇరాన్ కానీ, అటు అమెరికా- కానీ వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేకపోవడంతో సమస్య మరింత బిగుసుకుంటోంది. కచ్చితమైన హామీలు, పరిహారం ఇవ్వాలని ఇరాన్ పట్టుబడుతోంది. అమెరికా సైతం తామ అనుకున్న లక్ష్యాలకు చేరువలో ఉన్నామని సంకేతాలు ఇస్తూనే సైనిక చర్యలను నిలిపివేసేందుకు నిరాకరిస్తోంది.




