7 March, 2026 | 9:24 AM

క్యూబాపై ట్రంప్ కన్ను

07-03-2026 02:01 AM

ఇరాన్‌తో చేస్తున్న యుద్ధాన్ని ముగించడమే ప్రస్తుతం తాను ప్రాధాన్యమిచ్చే అంశమని పేర్కొంటూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన తర్వాతి టార్గెట్ క్యూబా అని ప్రకటించారు. వైట్‌హౌస్ వేదికగా తాజాగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజ కీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒకసారి వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అపహరించిన తరహాలోనే, త్వరలో క్యూబా అధినేత మాగ్వెల్ డయాజ్ కేనల్‌ను టార్గెట్ చేస్తారని అంతర్జాతీయంగా చర్చ నడుస్తున్నది. ప్రజాస్వామ్యం పేరుతో వెనిజులా సార్వభౌమత్వాన్ని హరించిన ట్లుగానే, క్యూబా సార్వభౌమత్వాన్నీ హరించనుందనే సంకేతాలు అగ్రరాజ్యం నుంచి వెలువడుతున్నాయి.

అమెరికా ఇప్పటికే క్యూబాకు ఇతర దేశాల నుంచి చమురు చేరకుండా తీవ్రమైన అడ్డంకులు సృష్టిస్తోంది. చమురు రవాణా చేసే నౌకలపై ఆంక్షలు విధిస్తూ క్యూబా ఇంధన అవసరాలను దెబ్బతీస్తోంది. దీంతో క్యూబా తీవ్రమైన చమురు సంక్షేమాన్ని ఎదుర్కొంటున్నది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం.. రవాణా వ్యవస్థ నిలిచిపోవడం వంటి పరిణామాలతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నది. ఒక రకంగా అమెరికా అంతర్జాతీయ స్థాయిలో పోలిసింగ్ చేస్తూ తన మాట వినని దేశాలను ఆర్థికంగా వేధిస్తోంది. ఐక్యరాజ్యసమితి (ఐరాస) నిబంధనలను, మార్గదర్శకాలను పక్కన పెట్టి అనధికారికంగా అంతర్జాతీయ పోలిసింగ్ చేస్తున్నది. క్యూబా ప్రజలు కమ్యూనిస్ట్ భావజాలాన్ని కలిగి ఉండటం, వారు అమెరికాను సామ్రాజ్యవాద దేశంగా భావించడం, రష్యా వంటి ప్రత్యర్థి దేశాలతో క్యూబా స్నేహసంబంధాలు కలిగి ఉండటం.. అగ్రరాజ్యానికి ఏమాత్రం మింగుడు పడని అంశాలు.

తమ దేశ తీరానికి కేవలం 90 మైళ్ల దూరంలో ఉండే ఒకచిన్న దేశమైన క్యూబా ఎల్లప్పుడూ తన చెప్పు చేతల్లో ఉండాలనేది అమెరికా లక్ష్యం. తద్వారా ఆ దేశంలోని సహజ వనరులు, పర్యాటక రంగంపై అమెరికా కార్పొరేట్ సంస్థల నియంత్రణను స్థాపించడమూ మరో టార్గెట్. క్యూబాను టార్గెట్ చేయడం అగ్రరాజ్యానికి ఇదేం మొదటిసారి కాదు. గతంలో క్యూబా విప్లవ వీరుడు ఫిడెల్ క్యాస్ట్రోను అంతమొందించేందుకు తన గూఢచారి సంస్థ సీఐఏ ద్వారా అమెరికా శతవిధాలా ప్రయత్నించిం ది. ఫిడెల్ క్యాస్ట్రోపై అమెరికా చేసిన హత్యాయత్నాలు అంతర్జాతీయ స్థా యిలో అప్పట్లో సంచలనం సృష్టించాయి. 1960 నుంచి 2000 వరకు క్యాస్ట్రోపై సుమారు 638 సార్లు హత్యాప్రయత్నాలు జరిగాయంటే, అమెరికా ఎంత కసిగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. 1960 ప్రాంతంలో క్యాస్ట్రో పీల్చే సిగార్లలో సీఐఏ చిన్నసైజ్ బాంబులు పెట్టింది.

1961లో అమెరికా ‘బే ఆఫ్ పిగ్స్’ దాడి ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూసింది. 1963లో క్యాస్ట్రోకు విషపూరితమైన పానీయాలు ఇచ్చేందుకు ప్రయత్నించింది. 1970లో ఫంగస్‌తో నిండిన డైవింగ్ సూట్ల ద్వారా చంపాలని చూసింది. 2000లో పనామాలో క్యాస్ట్రో ప్రసంగించాల్సిన వేదిక కింద 90 కేజీల పేలుడు పదార్థాలను అమర్చింది. అయినప్పటికీ, క్యాస్ట్రో ప్రా ణాలతో బయటపడగలిగారు. ఇలా దశాబ్దాల నుంచీ క్యూబాను లొంగదీసుకునేందుకు అమెరికా చేయని ప్రయత్నం లేదు. తాజాగా ట్రంప్ వ్యాఖ్యలు చూస్తుంటే క్యూబాపై మరోసారి ఆధిపత్యం చలాయించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.