నిరుద్యోగం కోరల్లో యువత!
దేశాభివృద్ధి అనేది సదరు ప్రభు త్వ యంత్రాంగం సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. సమర్థులైన అధికారులతో కూడిన యంత్రాంగంతో దేశాభి వృద్ధి రేటు గణనీయంగా మెరుగుపడుతుంది. 1992కు పూర్వం నియామకాలు చేయాల్సిన పోస్టులను గుర్తించే అధికారం ఆయా శాఖల డైరెక్టర్లకు, కమిషనర్లకు మా త్రమే ఉండేది. వారి ద్వారానే నేరుగా ఉ ద్యోగులను రిక్రూట్‌మెంట్లకు పంపేవారు. దీని ద్వారా ప్రభుత్వ శాఖల్లో వెనువెంటనే నియామకాలు జరిగేవి.
కానీ 1993లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియామకానికి ఆర్థికశాఖ అనుమతి కావాలని నిబం ధన విధిస్తూ జీవో ఎంఎస్ నెంబర్ 275 ను జారీ చేసింది. ఈ జీవో కారణంగా రిక్రూట్మెంట్ వ్యవస్థ కుప్పకూలింది. 2023లో పార్లమెంట్ స్థాయి సంఘం చెప్పిన వివరాల ప్రకారం దేశంలో 9 లక్షల 60వేల కేంద్ర ప్రభుత్వ ఖాళీలు ఉన్నవి. ప్రజాస్వా మ్య వ్యవస్థలో ఉద్యోగాల భర్తీని ఎప్పుడూ ఉపాధి కోణంలో చూడరాదు. పటిష్టవంతమైన సమర్థవంతమైన యంత్రాంగం ఉన్నప్పుడే అభివృద్ధి సంక్షేమ పథకాలు అట్టడుగు ప్రజలకు అందుతాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పదవీ విరమణల వల్ల ఏర్పడిన ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం వల్ల ఒక్క రూపాయి కూడా భారం పడదు. ఇందుకు కొత్తగా బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి పని చేయగలిగి, పనిని కాంక్షిస్తున్నప్పటికీ పని దొరకకపోవడం, అమల్లో ఉన్న వేతనాలతో పని చేయడానికి ఇష్టపడుతున్నప్పటికీ, ఉపాధి లభించని స్థితిని అనిచ్ఛాపూర్వక నిరుద్యో గం అంటారు. ఉపాధి ఉండి కూడా తన చదువు స్థాయికి తగిన ఉద్యోగం కాదని పనిచేయడానికి ఇష్టపడని దానిని ఇచ్ఛాపూర్వక నిరుద్యోగమంటారు.
తగ్గుతున్న ఆసక్తి..
గతేడాది మార్చి 25 నాటికి ఎంఎస్‌ఎంఈ పోర్టల్‌లో నమోదై ఉన్న కంపెనీల సంఖ్య 6.20కోట్లుగా ఉంది. ఏప్రిల్ 2025లో భారత్ జనాభా 146 కోట్లు, కార్మిక శక్తి, భాగస్వామ్యం, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ (ఎల్‌ఎఫ్‌పీఆర్) అంటే ఉద్యోగాలు చేస్తున్నవారు, ఉద్యోగాల కో సం ప్రయత్నిస్తున్న వారు వెరసి మొత్తం జనాభా 81 కోట్లు (55 శాతం). ఉపాధి పొందుతున్న జనాభా నిష్పత్తి (వర్కర్ పాపులేషన్) 52 శాతం అనగా 72 కోట్లు. ఈ రెండు గణాంకాల మధ్య వ్యత్యాసం 4 కోట్లు, వీరంతా నిరుద్యోగులు కావడంతో నిరుద్యోగ రేటు 5 శాతంగా ఉంది. ఎంఎస్‌ఎంఈలకు కార్మికుల అవసరం చాలా ఉంటుంది. అయితే ఈ పరిశ్రమలు కూడా కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి.
ప్రతిభావంతులను ఆకర్షించలేకపోతున్నాయి. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుం టున్న వారిలో అవసరమైన విద్యార్హతలు, నైపుణ్యాలు లేకపోవడమే మొదటి కార ణం. ఈ పరిశ్రమలు సమకూరుస్తున్న ఉద్యోగాల్లో చేరేందుకు యువజనులు ఆసక్తి చూపకపోవడం రెండో కారణం. ఎం దుకంటే కంపెనీలు ఇచ్చే తక్కువ వేతనాలకు ఉద్యోగాలు చేయడానికి యువత వి ముఖత చూపుతున్నారు.ఎంఎస్‌ఎంఈలో అత్యధికంగా 98 శాతం సూక్ష్మ పరిశ్రమ లు. ఈ కంపెనీల్లో ఉద్యోగులు లేదా కార్మికులుగా ఉన్న 26 కోట్ల మందిలో చాలా మంది కుటుంబ సభ్యులు లేదా బంధువులే ఉన్నారు. దీన్నిబట్టి యజమాని, సేవ కుడు సంబంధం ఉన్నది చిన్న, మధ్య తర హా పరిశ్రమల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది.
దేశంలోని 10 లక్షల ఎంఎస్‌ఎంఈలు తమ వ్యాపారాలను పెంపొందించుకుం టూ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. పాఠశాల విద్యను మధ్యలోనే వదిలివేసిన వారు, లేదా పాఠశాల విద్యార్హతలు మాత్ర మే కలిగిన వారు లేక ఒక ప్రాథమిక ఆర్ట్స్ లేదా సైన్స్ డిగ్రీ ఉన్నవారు నుంచి ఉద్యోగాలకు డిమాండ్ వస్తున్నది. నిరుద్యోగం తగ్గాలంటే ప్రభుత్వాలు/పాఠశాల స్థాయి నుంచి వృత్తి విద్యను అందించడంతోపా టు చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణా లు అందించాలి.
ఔట్‌సోర్సింగ్‌తో నష్టమే..
ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీ చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16, 21, 23 నిబంధనలను ఉల్లంఘించడమే. ఈ విధానంలో ఉద్యోగులను నియమించడం పెద్ద మాయ. చట్టం ప్రకా రం లభించాల్సిన పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, రిటైర్మెంట్ ప్రయోజనాలు, తది తర ఉద్యోగుల ప్రయోజనాలు ఎగవేసేందుకు ప్రభుత్వాలు ఈ ఎత్తుగడను వేస్తున్నాయి.
కార్మికులను ప్రభుత్వ సంస్థలు నేరుగా కాకుండా ఏజెన్సీల ద్వారా ఉద్యోగాల్లోకి తీసుకోవడం ద్వారా కాంట్రాక్టర్ తన కమీషన్ తీసుకొని వారికి సరైన వేతనాలు చెల్లించడం లేదు. ఔట్ సోర్సింగ్ విధానంలో కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారు. నచ్చినంత కాలం పని చేయించుకుని, నచ్చకపోతే ఉద్యోగం నుం చి కార్మికులను తీసి వేస్తున్నారు. వారికి కనీసం వేతనం కూడా ఇవ్వడం లేదు. జీతం నుంచి కట్ చేసే ఈపీఎఫ్ కూడా సకాలంలో ఇవ్వడం లేదు.
కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు ‘పంజాబ్ స్టేట్ వర్సెస్ జగత్ సింగ్’ కేసులో తీర్పు ఇవ్వడం జరిగినది. అలాగే 2006లో ‘స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ ఉమాదేవి’ కేసులో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగ నియమాకాలు చేపట్టవద్దని తీర్పు ఇచ్చినప్పటికీ దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔట్ సోర్సింగ్ పద్ధతిని ఇంకా కొనసాగిస్తూ, నిరుద్యోగుల నోట్లో మన్ను కొడుతున్నాయి. నియామకం ఏదై నా ఉద్యోగులతో సమానంగా వారు పనిచేస్తున్నందున వారిని రెగ్యులర్ చేసి సమాన వేతనమివ్వాలి.
కారణాలు అనేకం..
2024- కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలో నిరుద్యోగ రేటు కేవలం 3.2 శాతంగానే ఉన్నదని, తమ పాలనలో నిరుద్యోగ సమస్య తగ్గిందని చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ వాస్తవం వేరు. సెంటర్ ఫర్ ఇండియన్ ఎకానమీ నివేదిక ప్రకారం నేడు దేశంలో 9.2 శాతం నిరుద్యోగ రేటు ఉన్నది. దేశంలో ప్రతి సంవత్సరం 26 లక్షల మంది గ్రాడ్యుయేట్లు, 5 లక్షల మంది పోస్ట్ గ్రాడ్యుయే ట్లు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు.
భారత్‌లో నిరుద్యోగులుగా ఉన్న వారిలో 83 శాతం యువతేనని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నది. దీంతో దేశంలో నిరుద్యోగం రేటు పెరిగిపోతున్నది. దేశంలో నిరుద్యోగం ఏ స్థాయి లో ఉందో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం.
ముంబై విమానాశ్ర యంలో డ్రైవర్లు, మెయింటెనెన్స్, రిపేర్లు తదితర చిన్న తరహా ఉద్యోగాల భర్తీకి 22 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ దీనికి 25వేల మంది నిరుద్యోగులు హాజ రు కావడం ఆశ్చర్యపరిచింది. మధ్యప్రదేశ్‌లో ఎలాంటి నైపుణ్యాలు అవసరం లేని 15 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇస్తే 11వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎంబీఏ, పీజీ, ఇంజనీరింగ్ పట్టభద్రులు ఉండడం బాధాకరం. గుజరాత్‌లో కేవలం ఐదు చెప్రాసి ఉద్యోగాలకు పదివేల మంది దరఖాస్తు చేసుకోవడం విడ్డూ రంగా అనిపిస్తోంది.
15 రాష్ట్రాల్లో అత్యధికం..
ప్రతి వెయ్యి మంది నిరుద్యోగుల్లో ము గ్గురికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తున్నాయి. దేశంలో నిరుద్యోగ రేటు 15 రాష్ట్రాల్లో అత్యధికంగా 37 శాతం ఉండ గా, తర్వాత రాజస్థాన్‌లో 28 శాతం, తెలంగాణాలో ఇది ఏడు శాతంగా ఉన్నది. కులా లపరంగా చూస్తే దేశంలో అగ్రకులాల్లో నిరుద్యోగం రేటు 10 శాతం, ఎస్సీల్లో 18 శాతం, బీసీల్లో 14 శాతం, ఎస్టీల్లో 14శాతంగా ఉన్నది.
దేశంలో అధిక జనాభాకు తోడు నాణ్యమైన విద్య కొరవడటం, పరిశ్రమల అవసరానికి తగినట్టుగా కోర్సులు అందించకపోవడం, కుటీర పరిశ్రమలు దెబ్బతినడం, దూరంగా వెళ్లి ఉద్యోగాలు చే యడానికి యువత సిద్ధపడకపోవడం నిరుద్యోగానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవ చ్చు. దీనిని రూపుమాపటానికి కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
వ్యాసకర్త సెల్: 9963027577
కపిలవాయి దిలీప్ కుమార్




