భారీ స్కామ్.. కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
హైదరాబాద్,(విజయక్రాంతి): ఫోంజి స్కీమ్ కేసు(Ponzi Scheme Case)లో సైబరాబాద్ పోలీసులు(Cyberabad Police) ఇద్దరిని ఆదివారం అరెస్టు చేశారు. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్(Falcon Invoice Discounting) పేరుతో కేటుగాళ్లు భారీ మోసానికి పాల్పడారు. అమాయకులకు తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించారు. అధిక లాభాల పేరిట రూ.850 కోట్లు వసూలు చేశారు. హైదరాబాద్ లో క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్(Capital Protection Force Private Limited) పేరుతో 2021లో కొంతమంది కంపెనీ పెట్టారు. చిన్న తరహా పెట్టుబడుల పేరుతో ఫోంజి స్కీమ్ ను తీసుకువచ్చారు.
ఈ కేసులో క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ కావ్య నల్లూరి(Capital Protection Force Director Kavya Nalluri), వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమర్ ఓదెల నిందితులను సైబరాబాద్ ఆర్థిక విభాగం(Cyberabad Finance Department) పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం 45 నుంచి 180 రోజుల్లోనే 11 నుంచి 22 శాతం రిటన్స్ వస్తాయని చెప్పడంతో అమాయక ప్రజలు 6,979 మంది ఏకంగా రూ.1,700 కోట్లు పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడులు అధికంగా రావడంతో ఈ జనవరి 15న క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. సేకరించిన రూ.1700 కోట్లలో రూ.850 కోట్లు తిరిగి చెల్లించి, మిగతా రూ.850 కోట్లకు కుచ్చుటోపీ పెట్టారని పోలీసులు వెల్లడించారు.




