ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
ఆరు వాహనాలు స్వాధీనం
మేడ్చల్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఇద్దరు నిందితులను బాచుపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. డిసిపి కె సురేష్ కుమార్ కథనం ప్రకారం గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం సొంత గుడిపాడు గ్రామానికి చెందిన ఒంగోలు రమేష్ బాబు, వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఇందర్ చెడు గ్రామానికి చెందిన చంద్రమౌళి గుండప్ప, పి నరసింహ అనే వ్యక్తులు కుత్బుల్లాపూర్ మండలం సూరారం లో ఒకే వీధిలో ఉంటున్నారు.
ఆర్థిక సమస్యల కారణంగా బైకులు చోరీ చేస్తున్నారు. బాచుపల్లి లోని కౌసల్య కాలనీకి చెందిన ఐటీ ఉద్యోగి కే మహేష్ తన ద్విచక్ర వాహనాన్ని విక్రయించడానికి ఓఎల్‌ఎక్స్ యాప్ లో పెట్టాడు. దీనిని చూసి వీరు కొనడానికి వెళ్లారు. బెస్ట్ డ్రైవ్ చేస్తామని వాహనంతో పరారయ్యారు.
కేసు నమోదు చేసుకున్న బాచుపల్లి పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. ఒంగోలు రమేష్ బాబు, చంద్రమౌళి గుండప్ప ను అరెస్టు చేయగా, పి నరసింహ పరారీ లో ఉన్నాడు. వీరు మొత్తం 6 బైకులు చోరీ చేశారు. ఈ బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న బాచుపల్లి పోలీసులను డిసిపి అభినందించారు.






