ప్రమాదాల నివారణకు వాహనాదారులు సహకరించాలి
- ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్
గరిడేపల్లి(విజయ క్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని గరిడేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ కోరారు. మండల కేంద్రమైన గరిడేపల్లి లో బుధవారం రాత్రి ప్రమాదాలను నివారణ చర్యల్లో భాగంగా వాహనాల యజమానులకు రేడియం స్టిక్కర్లు అందించారు. రేడియం స్టిక్కర్లను వాహనాలకు అంటించడం ద్వారా కొంతమేరకు ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుందన్నారు. జిల్లా ఎస్పీ నర్సింహ ఆదేశాల మేరకు వాహనాలపై రేడియం స్టిక్కర్లను అందిస్తున్నట్లు తెలిపారు.
రాత్రి సమయంలో మనుషులకు, పశువులకు వాహనాలు ఢీకొని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ఈ ప్రమాదాల్లో అనేకమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, దీంతోపాటు మూగజీవులైన పశువులు కూడా విగత జీవులుగా మారే పరిస్థితి నెలకొని ఉందన్నారు. ఈ ప్రమాదాలను నివారించడంలో భాగంగా రేడియం స్టిక్కర్లను వాహనాలకు, పశువులకు అంటిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా రాత్రి సమయంలో భారీ వాహనాలకు ఈ రేడియం స్టిక్కర్ ద్వారా గుర్తించే అవకాశం లభిస్తుందని తద్వారా ప్రమాదం జరగకుండా ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో వాహనదారులు, ప్రజలు, పశువుల యజమానులు పోలీసులతో సహకరించాలని ఆయన కోరారు. గరిడేపల్లి లోని పొనుగోడు క్రాస్ రోడ్డు, కల్మలచెరువు క్రాస్ రోడ్డు వద్ద ఈ స్టికర్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






