కాళేశ్వరంలో ప్రారంభమైన సరస్వతి అంత్య పుష్కరాలు
కాళేశ్వరం,(విజయక్రాంతి): సరస్వతి అంత్య పుష్కరాలు(Saraswati Antya Pushkaralu) కాళేశ్వరం గోదావరి ప్రాణహిత అంతర్వాహిని సరస్వతి నది లో గురువారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల తొలి రోజు ఉదయం 5.43 గంటలకు పవిత్ర నది సంగమంలో తొలి పుణ్యస్నానాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆచరించారు. అనంతరం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు శ్రీ గోవింద హరి తదితరులు ఆచరించారు.
అలాగే భూపాలపల్లి, రంగారెడ్డి నియోజకవర్గాల శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, మల్ రెడ్డి రంగారెడ్డి పుష్కర స్నానం చేశారు. పుష్కరాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. భద్రత, పారిశుధ్యం, తాగునీరు, వైద్య సేవలు, రవాణా వంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. భక్తులు సౌకర్యవంతంగా, సురక్షితంగా పుష్కర స్నానాలు నిర్వహించుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.






