3 June, 2026 | 1:48 AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

03-06-2026 12:14 AM

కల్వకుర్తి జూన్ 2: వరుసకు సోదరులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా కారు చెట్టును ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది.

కల్వకుర్తి ఎస్త్స్ర కురుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం, వంగూరు మండల కేంద్రానికి చెందిన బొడ్డుపల్లి ప్రవీణ్ (27), బొడ్డుపల్లి బాలు (29), రాజు అనే ముగ్గురు యువకులు, సోమవారం రాత్రి 11 గంటలకు తర్నికల్ గ్రామంలో తమ బంధువుని దించేందుకు వెళ్లారు తిరిగి స్వగ్రామానికి  వంగూరుకు బయలుదేరారు. మార్గమధ్యలో హైదరాబాద్‌శ్రీశైలం ప్రధాన రహదారిపై కొండారెడ్డిపల్లి గేట్ సమీపంలో కారు  చెట్టును ఢీకొని కనిపించింది. తెల్లవారుజామున 3 గంటలకు కారును గుర్తించిన వ్యక్తులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

వారు అక్కడికి చేరుకొని చూడగా ప్రవీణ్, బాలు అక్కడికక్కడే మృతి చెందగా, రాజు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు యువకులు వరుసకు సోదరులు కాగా, ఇటీవల రాజు తల్లి మరణించడంతో దశదిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని తర్నికల్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతోనే ప్రమాదం జరిగి  ఉండొచ్చని మృతుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర తెలిపారు.  మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించారు.