ప్రజా సంక్షేమం, సమగ్రాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ
- అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 2, (విజయక్రాంతి): ప్రజా సంక్షేమం సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో మంగళవారం ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ముందుగా తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద జూలూరుపాడు మండలానికి చెందిన యెల్లంకి కలావతి (జూలూరుపాడు), కేలోత్ బాలూ (సాయిరాం తండా), బడావత్ లలిత (గుండ్లరేవు), చిమట వెంకట నరసమ్మ (సంబునిగూడెం)లకు మంత్రి మంజూరు పత్రాలను అందజేశారు. అలాగే 478 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల కింద రూ.51.06 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు.
వ్యవసాయ యాంత్రికరణ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలకు రూ.59.53 లక్షల విలువైన ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వివిధ విద్యాసంస్థల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కళాప్రదర్శనలు సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రగతి ప్రదర్శన స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అంతకుముందు జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో తన క్యాంపు కార్యాలయం, ఐడీఓసీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్ అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, డిఆర్‌ఓ పద్మావతి, కొత్తగూడెం ఆర్డీవో మధు ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, రైతులు, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్కడకు విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు, ప్రజలకు మరొక్కసారి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.






