ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఖమ్మం, జూన్ 2(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఖమ్మం జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో మంగళవారం జరిగిన ఈ వేడుకలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా హాజరై, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన ఆయన, జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాల స్ఫూర్తితో.. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలన సాగిస్తోందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్థిక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు, సంక్షేమాన్ని ప్రతి ఇంటికి చేర్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలు, ప్రణాళికలను డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా సవివరంగా ప్రకటించారు.
రాష్ట్ర ఆర్థిక వృద్ధిని ప్రపంచ దేశాల సరసన నిలబెట్టేందుకు ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రస్తుతం 200 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు, ఆ తర్వాత 2047 నాటికి 3 ట్రిలియన్ యూఎస్ డాలర్ల బృహత్తర వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అంతర్జాతీయ నమూనాలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ’క్యూర్, ప్యూర్, రేర్’ అనే మూడు విభాగాలుగా వర్గీకరించి, ప్రణాళికాబద్ధమైన వృద్ధికి శ్రీకారం చుట్టామని ఆయన ప్రకటించారు. ప్రపంచంలో ఏ అభివృద్ధి చెందిన దేశంలోనూ లేని విధంగా ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పించడమే ధ్యేయంగా కోటి 15 లక్షల కుటుంబాలకు రూ. 5 లక్షల ఉచిత జీవిత బీమా అందించేలా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం‘ తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.
మొదటి విడత కింద మంజూరైన 16,243 ఇళ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 441 కోట్లు జమ చేశామన్నారు. ఇప్పటికే 8,291 ఇళ్ల గృహప్రవేశాలు పూర్తి చేశామని, త్వరలోనే రెండో విడత కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2,000 చొప్పున ఇళ్లను పారదర్శకంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 2,45,069 మంది లబ్ధిదారులకు రూ. 41 కోట్ల సబ్సిడీ భరిస్తూ రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందించామని,
ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం ద్వారా జిల్లాలో రూ. 303.55 కోట్ల పొదుపు సాధ్యమైందని చెప్పారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ కోసం 2,50,204 కుటుంబాలకు రూ. 236.60 కోట్ల సబ్సిడీని భరించామని, కొత్తగా 59,448 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయడం ద్వారా మొత్తం 4,70,591 కార్డుల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని వివరించారు. తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.






