వచ్చే ఐదేళ్లలో యూసీసీ తప్పకుండా అమలు చేస్తాం
అంబేద్కర్ కూడా యూసీసీని సపోర్ట్ చేశారు
ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని సైతం అమలు చేస్తాం
అమిత్‌షా కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, మే 26 : దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి, ఒకే దేశం ఒకే ఎన్నిక అమలు విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఐదేళ్లలో రెండింటిని తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ రెండు అంశాలపై నిపుణులతో విస్తృతంగా చర్చించి తప్పకుండా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి పౌరస్మృతిపై ఆయన మాట్లాడుతూ.. “ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయాల్సిన బాధ్యత మాపైనే ఉంది. దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు కూడా ఇప్పటికే సిద్ధమయ్యాయి. అప్పట్లో కేఎమ్ మున్షీ, రాజేంద్ర బాబుతో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లాంటి మేధావులంతా కలిసి దీనిపై చర్చించారు. మతం ఆధారంగా భారత్‌లో ఎలాంటి చట్టాలు ఉండకూడదని అప్పట్లోనే వాళ్లు వాదించారు. ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని ప్రతిపాదించారు” అని వ్యాఖ్యానించారు.
ఒకే దేశం ఒకే ఎన్నిక..
బీజేపీ ఎజెండాలో ఉన్న మరో ముఖ్యమైన అంశం ఒకే దేశం ఒకే ఎన్నిక. దీన్ని కూడా రాబోయే ఐదేళ్లలో తప్పకుండా అమలు చేస్తామని అమిత్‌షా తేల్చి చెప్పారు. మరోసారి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఏక కాలంలో ఎన్నికలు నిర్వహిస్తామని, తద్వారా ఎన్నికల వ్యయం తగ్గించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ సారి ఎన్నికలు విపరీతమైన ఎండల మధ్య జరుగుతున్నందున, పోలింగ్ శాతంపై ప్రభావం పడుతోందని, ఇకపై ఎన్నికలను ఎండాకాలంలో కాకుండా వేరే రోజుల్లో నిర్వహిస్తే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. “దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేయాల్సిన సమయం వచ్చేసింది. ఇందుకు అనుగుణంగా ప్రధాని మోదీ.. రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. నేను కూడా ఆ కమిటీలో ఉన్నాను. ఇప్పటికే నివేదిక కూడా అందజేశాం. కచ్చితంగా వచ్చే ఐదేళ్లలో దీన్ని అమలు చేసి తీరుతాం.” అని స్పష్టం చేశారు.






