13 August, 2026 | 4:34 PM

ప్రతిపక్షం పారిపోవడం ఇదే మొదటిసారి

13-08-2026 03:11 PM

విపక్షాల ఆందోళనలతో చర్చలు సరిగా జరగలేదు

న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళనలతో వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు(Monsoon Session of Parliament) సరిగా జరగలేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు(Union Minister Kiren Rijiju) గురువారం పేర్కొన్నారు. పార్లమెంట్ ఉభయసభల్లో చర్చలు సరిగా జరగలేదన్నారు. లోక్ సభలో 19 శాతం, రాజ్యసభలో 39 శాతం సమయం మాత్రమే చర్చ జరిగిందని వెల్లడించారు. ప్రతిపక్షాలు చర్చకు కట్టుబడకుండా పారిపోతున్నాయని కేంద్రమంత్రి ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ప్రతిపక్షాలు చర్చకు డిమాండ్ చేయాలి, చర్చకు పట్టుబట్టాలి.. ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని తెలిపారు. అసలు చర్చలే జరగకూడదు అనేలా ప్రతిపక్షాలు ప్రవర్తించాయిని మండిపడ్డారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, లోక్‌సభలో పరీక్షలలో అక్రమాల నివారణకు సంబంధించిన ఒకే ఒక్క బిల్లుపై చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పేపర్ లీక్‌లు, రహస్యంగా పరీక్ష పత్రాలను పంపడం లేదా కొనుగోలు చేయడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ సమావేశాల్లో ఒక కఠినమైన చట్టాన్ని ఆమోదించడం జరిగింది. అదే ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్. తన జీవితంలో తనకు ఉన్న పార్లమెంటరీ అనుభవం ప్రకారం ప్రతిపక్షం చర్చకు దూరంగా పారిపోవడం ఇదే మొదటిసారి అని కేంద్ర మంత్రి విమర్శించారు. పార్లమెంట్ సమావేశాల్లో మొత్తం 12 బిల్లులు ఆమోదం పొందాయి, కానీ ప్రతిపక్షాల నిరంతర వ్యతిరేకత, అంతరాయాల కారణంగా వాటిపై జరిగిన చర్చ నాణ్యత సంతృప్తికరంగా లేదని ఆయన పేర్కొన్నారు.