1 June, 2026 | 2:08 AM

సాగుకు ఉరితాడే రైతు డిస్కం

01-06-2026 01:23 AM
  1. డిస్కంల అప్పులపై సీఎం వ్యాఖ్యలు అవాస్తవాలు 
  2. సోలార్ పవర్‌తో 24 గంటల విద్యుత్ ఎలా సాధ్యం?  
  3. ఆర్పీడీసీఎల్ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే విద్యుత్ ఉద్యమం 
  4. మాజీ మంత్రి హరీశ్‌రావు 

సిద్దిపేట రూరల్, మే 31(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ‘రైతు డిస్కం’ (టీజీఆర్పీడీసీఎల్) ఏర్పాటును బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా వ్యతిరేకించారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించడానికే ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 8 ప్రకారం రైతు డిస్కంకు అధికంగా పునరుత్పాదక ఇంధన విద్యుత్‌ను కేటాయించనున్నట్లు పేర్కొన్నారని, సోలార్ విద్యుత్ పగటి వేళల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని హరీశ్ రావు అన్నారు. అలాంటప్పుడు రైతులకు 24 గంటల విద్యుత్ ఎలా అందిస్తారో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తేనే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని సీఎం బహిరంగంగా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.

మూడో డిస్కం ఏర్పాటుతో కాళేశ్వరం, దేవాదుల, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, సీతమ్మ సాగర్ వంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు. డిస్కంల అప్పుల విషయంలో ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణలను కూడా హరీశ్ రావు ఖండించారు. బీఆర్‌ఎస్ పాలనలో పదేళ్ల కాలంలో ప్రభుత్వం డిస్కంలకు రూ.27 వేల కోట్లు బకాయి పడిందని, సగటున ఏడాదికి సుమారు రూ.రెండు వేల కోట్లు మాత్రమేనని తెలిపారు.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వల్ప కాలంలోనే రూ.25,284 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని, ఏడాదికి సగటున రూ.10 వేల కోట్లకు పైగా అప్పుల భారాన్ని మోపిందని ఆరోపించారు.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను గణనీయంగా విస్తరించామని హరీశ్ రావు పేర్కొన్నారు.

సబ్‌స్టేషన్లు ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్ల సామర్థ్యాన్ని భారీగా పెంచి తెలంగాణను విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. రైతు డిస్కం ఏర్పాటును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. లేకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యుత్ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.