జగిత్యాల, సిరిసిల్లలో అకాల వర్షం
తడిసిన ధాన్యం
జగిత్యాల /సిరిసిల్ల, మే8(విజయక్రాంతి):జగిత్యాల జిల్లా లో ఆకాల వర్షం జగ్గసాగర్ లో అత్యధికంగా వర్షాపాతం నమోదవగా మేట్ పల్లి, ఐలాపూర్, జగిత్యాల, అల్లీపూర్, మేడిపల్లి, కథలాపూర్, రాయికల్, సారంగాపూర్, రాఘవపేట, గోదూర్, కోరుట్ల, మన్నెగూడెం, పొలాస లలో ఇదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.జగిత్యాల తోపాటు ఇతర గ్రామాల్లోని పొలాస, తకళ్లపెల్లి, కల్లెడ ఐకేపీ (IKP) కేంద్రాల్లోని వరి ధాన్యం,మక్కలు కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షం వల్ల పూర్తిగా తడిసింది.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.కొనుగోలు కేంద్రాల వద్ద నీరుచేరి ఆరబెట్టిన ధాన్యం కుప్పలు, తూకం వేసిన బస్తాలు కూడా వర్షపు నీటిలో నానిపోయాయి.కొనుగోళ్లలో జాప్యం జరగడం వల్ల ధాన్యం కేంద్రాల వద్దే నిల్వ ఉండి వర్షానికి తడిసిపోతోంది.అకాల వర్షాల పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం, టార్పాలిన్ కవర్లు అందుబాటులో లేకపోవడం వల్ల తీవ్ర నష్టం జరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాల్రావుపల్లిలో కురిసిన అకాల వర్షం రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం కురవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది.ధాన్యం తడవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పండించిన పంట వర్షానికి దెబ్బతినడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించడంతో పాటు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రైతులు కోరారు.






