27 February, 2026 | 3:54 AM

మొక్కజొన్న వెన్ను విరిచిన అకాల వర్షాలు

27-02-2026 12:00 AM

పరిహారం ఇవ్వాలని అన్నదాతల విజ్ఞప్తి 

మహబూబాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. చేతికందే దశలో అకాల వర్షం బారిన పడి నష్టపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు సుమారు 3000 ఎకరాల్లో మొక్కజొన్న పంటతో పాటు మిర్చి, ఇతర పంటలు దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు. కొత్తగూడ, గూడూరు, బయ్యారం మండలాల్లో అకాల వర్షానికి మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం కలిగించిందని రైతులు చెబుతున్నారు.

చేతికందే దశలో ఉన్న పంటను గాలివాన బీభత్సం మింగేసిందని, దీనితో రెక్కల కష్టంతో పాటు పెట్టుబడి కూడా నేలపాలైందని రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కొత్తగూడ మండలంలో 1400 ఎకరాలు, గూడూరులో 800, బయ్యారంలో 200, ఇతర మండలాల్లోని పలు గ్రామాల్లో కొంతమేర మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధారించారు.

పంట నష్టం పోయినట్లు రైతులు అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఆయా గ్రామాల్లో మండల వ్యవసాయ శాఖ అధికారులు, మండల వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం వివరాలను ప్రాథమికంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు. అలాగే పలు గ్రామాల్లో మిర్చి పంట వర్షానికి దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు. ఎక్కువగా జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న పంటకు భారీగా నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు.

యాసంగి సీజన్లో నీటి వసతి అధికంగా ఉండడంతో పలుచోట్ల పత్తి పంటను తొలగించి మొక్కజొన్న సాగు చేశారు. వర్షాల వల్ల పత్తి పంట ఆశించిన దిగుబడి రాకపోవడంతో పంట కాలానికి ముందే చాలా చోట్ల తొలగించి మొక్కజొన్న వేసి కొంత నష్టాన్ని పూడ్చుకోవాలని చూసిన రైతాంగానికి అకాల వర్షాలు తీవ్ర నష్టం కలిగించాయి. దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించాలని, లేకపోతే తమ పరిస్థితి అగమ్య గోచరమేనని అన్నదాతలు పేర్కొంటున్నారు.

జిల్లావ్యాప్తంగా అకాల వర్షాల వల్ల ఇటీవల నష్టపోయిన పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా సర్వే చేయించి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తామని, పరిహారం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి సరిత తెలిపారు.  

నిండా ముంచిన అకాల వర్షం

ఎన్నో ఆశలతో అష్ట కష్టాలు పడి, వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంట చేతికందే దశలో అకాల వర్షం గద్దలా తన్నుకు పోయింది. ఏపుగా పెరిగిన పంట చూసి ఇక తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందనే సంతోషంలో ఉన్న నేపథ్యంలో గాలివాన తమను నిండా ముంచింది.

మొక్కజొన్న పంట గాలివానకు నేల వాలి ఎందుకు పనికిరాకుండా పోయింది. మిర్చి పంట వర్షానికి తడిసి రంగు మారి ధర పూర్తిగా పడిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించి ఆదుకోకపోతే మా పరిస్థితి అగమ్య గోచరం. సర్వేలతో సరిపెట్టకుండా పంట నష్టం పరిహారం ఇవ్వాలి. 

- భుఖ్య పద్మ, కత్తుల గట్టయ్య, రైతులు, కొత్తగూడ, గూడూరు