కొలీజియంను రద్దు చేస్తాం
కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్రకుశ్వాహా
కరకత్, మే 26: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే సుప్రీంకొలీజియంను రద్దుచేసేం దుకు మరోసారి ప్రయత్నిస్తుందని కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా తెలిపారు. బీహార్‌లోని కరకత్‌లో కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో కలిసి ఆయన ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుశ్వాహా మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకాలను సిఫారసు చేసే కొలీజియం వ్యవస్థ అప్రజాస్వామికమైనదని విమర్శించారు. ‘కొలీజియం వ్యవస్థలో అనేక లోపాలున్నాయి. అది అప్రజాస్వామికమైనది. దళితులు, ఓబీసీలు, అగ్రవర్ణాల్లోని పేదలు న్యాయమూర్తులు కాకుండా అది తలుపులు మూసేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ధర్మాసనాలను పరిశీలిస్తే కొన్ని వందల కుటుంబాలు మాత్రమే ఆధిపత్యం వహించినట్టు కనిపిస్తుంది’ అని ఆరోపించారు.






