29 July, 2026 | 7:55 AM

బీజేపీ అభివృద్ధి టీవీల్లోనే

27-05-2024 12:05 AM

ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు

అధికారం కోసం మోదీ ఏదైనా చేస్తారు

కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ వాద్రా

ఫతేగఢ్‌సాహిబ్/పటియాలా(పంజాబ్), మే 26: బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతోందని ప్రధాని నరేంద్రమోదీ చెబుతున్నారని, మరి ప్రజల అభివృద్ధి, సంక్షేమంలో ఏ మార్పు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పంజాబ్‌లో ఫతేగఢ్‌సాహిబ్ ఎన్నికల ప్రచారం పాల్గొన్న ఆమె.. అధికారం కోసం అబద్ధాలు చెబుతూ, అలవికాని హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. దేశంలో 70 కోట్ల మంది ప్రజలు నిరుద్యోగులుగా ఉన్నారని, 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగ రేటు గరిష్ఠ స్థాయికి చేరుకుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగంలోనూ 30 లక్షల ఖాళీలు ఉన్నాయన్నారు. దేశం వృద్ధి సాధిస్తుంటే ద్రవ్యోల్బణం ఎందుకు పెరుగుతోంది? ఉక్కు కర్మాగారాలు ఎందుకు మూతపడుతున్నాయి? జీఎస్టీ వల్ల ఇండస్ట్రీ ఎందుకు బలహీనపడుతోంది? మధ్యతరగతి ప్రజలకు ఒక్క పథకం కూడా తీసుకురాలేదు. వృద్ధి అనేది టీవీల్లోనే కనిపిస్తుంది. మీ జీవితాల్లో లేదు. అధికారం కోసం మోదీ ఏదైనా చేస్తారు. అందుకే నల్ల సాగు చట్టాలను వెనక్కు తీసుకున్నారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.