అర్బన్ బ్యాంక్ చైర్మన్ బీఆర్‌ఎస్ కైవసం
చైర్మన్‌గా రాపెల్లి లక్ష్మీనారాయణ
రాజన్న సిరిసిల్ల, జూన్ 7 (విజయక్రాంతి) : సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ చైర్మన్ పదవి బీఆర్‌ఎస్ కైవసమైంది. చైర్మన్‌గా రాపెల్లి లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్‌గా అడ్డగట్ల మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సింగిల్ నామినేషన్ దాఖలుతో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు పాలకవర్గ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జయకేతనం ఎగురవేసింది. 12 డైరెక్టర్ స్థానాలకు గురువారం జరిగిన ఎన్నికల్లో 8 స్థానాల్లో పార్టీ బలపరిచిన అభ్య ర్థులు గెలుపొందగా, ఇద్దరు స్వతంత్రులు, బీజేపీ, కాంగ్రెస్ తరఫున ఒక్కొక్కరు గెలుపొందారు. ఇద్దరు ఇండిపెండెంట్లలో ఒకరు గుడ్ల సత్యానందం బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో బీఆర్‌ఎస్ మద్దతుదారుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ క్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం బీఆర్‌ఎస్ ప్యానల్ మాత్రమే నామినేషన్ దాఖలు చేసింది. సింగిల్ నామినేషన్ దాఖలు కావడంతో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. టపాసులు కాల్చి బీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.






