రైతులందరికీ యూరియా
- రైతులు ఆందోళన చెందొద్దు
- వ్యవసాయ శాఖ జిల్లా అధికారితో విజయక్రాంతి ఇంటర్వ్యూ
సిద్దిపేట కలెక్టరేట్, సెప్టెంబరు 3: సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సరిపడ బస్తాలు లభించకపోవ డంతో పంటల సాగు నష్టాన్ని మిగిలిస్తాయని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, అధికారులు రైతులకు పరిష్కార మార్గాలు చూపించడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులకు కావాల్సిన యూరియా సరఫరాపై సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణితో విజయక్రాంతి ఇంటర్వ్యూ.
ప్రశ్న: సిద్దిపేట జిల్లాలో ఎన్ని ఎకరాలలో ఎలాంటి పంటలు సాగు చేశారు ?
జవాబు: జిల్లాలో వరి 331508, పత్తి 106921, మొక్కజొన్న 27826, కంది 6594, కూరగాయలు 14164 చొప్పున మొత్తం 4,87,013 లక్షల ఎకరాలలో పంట లు సాగు చేస్తున్నారు.
ప్రశ్న: సాగు చేసిన పంటలకు అవసరమైన యూరియా ఎంత, ఇప్పటివరకు ఎంత యూరియా రైతులకు పంపిణీ చేశారు.?
జవాబు: జిల్లా మొత్తానికి 43 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు 28 వేల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా చేశాము. ఇంకా 15వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉంది. ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించాం. దశల వారీగా దిగుమతి చేసుకుని పంపిణీ చేస్తున్నాం.
ప్రశ్న: ఈ సారి జిల్లాలో యూరియా కొరత ఎందుకు ఏర్పడింది ?
జవాబు: జిల్లాలో ఈసారి వర్షాలు సమయానికి కురవడంతో పంటల సాగు పెరిగింది. వరి, మొక్కజొన్న, పత్తి పంటలు గతం కంటే ఈసారీ అదికంగా సాగు చేశారు. సాగు విస్తీర్ణం పెరగడంతో యూరియా డిమాండ్ అధికమైంది.
ప్రశ్న: రైతులు కేంద్రాల వద్ద బారులు తీరుతున్న దృశ్యాలు రోజూ కనిపిస్తున్నాయి. దీనికి పరిష్కారం ఏమిటి?
జవాబు: రైతులు గంటల తరబడి క్యూలలో నిలబడుతున్నది నిజమే. దానిని తగ్గించేందుకు రైతులకు టోకెన్లు జారీ చేస్తున్నాం. మండలాల్లోని రైతు వేదికలలో, సహకార సంఘాల ద్వారా యూరియా సరఫరా చేస్తున్నాం. ప్రతి రైతుకు అవసరమైన పరిమితి మేరకే అధికారుల, పోలీసుల పర్యవేక్షణలో రైతులకు ఇబ్బందులు కలగకుండా పంపిణీ చేస్తున్నాం.
ప్రశ్న: జిల్లాలో యూరియా కొరతపై రైతులకు మీరిచ్చే సూచనలు ఏమిటి ?
జవాబు: రైతులకు కావలసిన యూరియా సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నాము, అధిక ధరలకు కానీ బ్లాక్ లో విక్రయించేందుకు అవకాశం లేదు. యూరియా పంపిణీ పారదర్శకంగా జరుగుతుంది. రైతులు ఆందోళన చెంది గంటల తరబడి విక్రయ కేంద్రాల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేదు. టోకెన్లు పొందిన వారు మాత్రమే యూరియా కోసం వెళ్లాలి. భవిష్యత్తులో ఇలాంటి కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రతి రైతుకు అవసరమైనంత యూరియా అందిస్తాం. ఆందోళన చెందొద్దు.






