28 June, 2026 | 2:51 AM

భారత్ బంధం బలోపేతం

28-06-2026 01:41 AM
  1. సీషెల్స్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ
  2. 194 ఏళ్ల జొనాథన్ తాబేలుకు ఆహారం అందజేత
  3. వాహనాలు, రేడియల్ బోట్ల అందజేసిన ప్రధాని

విక్టోరియా, జూన్ 27: సీషెల్స్ సముద్ర భద్రత, అభివృద్ధి భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. శనివారం ఉదయం మూడు రోజుల పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ సీషెల్స్‌లోని విక్టోరియా నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పాట్రిక్ హెర్మిని ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రవాస భారతీయులు ప్రధానికి ఘనంగా స్వాగతం పలికారు.

సీషెల్స్‌లో 29న జరిగే 50వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ప్రవాస భారతీయుల స్వాగతం అనంతరం ప్రధాని మోదీ ఆ దేశాధ్యక్షుడు పాట్రిక్ హెర్మినితో కలిసి జాతీయ వృక్షశాస్త్ర ఉద్యానవనంలోని భారీ తాబేళ్లను సందర్శించారు. ఇందులో 194 ఏళ్ల జొనాథన్ అనే తాబేలుకు ఆహారాన్ని అందజేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవిగా రికార్డుల్లోకెక్కింది. అనంతరం ప్రధాని బొటానికల్ గార్డెన్‌లో మొక్కలను నాటారు.

ప్రధాని పర్యటనకు సంబంధించిన పలు చిత్రాలను ఎక్స్‌లో పంచుకొని సందేశాన్నిచ్చారు. అధ్యక్షుడు పాట్రిక్ స్వాగతానికి కృతజ్ఞతలు తెలిపారు. హిందూ మహాసముద్రంలో భారత్‌కు అతి ముఖ్యమైన సముద్ర భాగస్వామి సీషెల్స్ అన్నారు. ఈ పర్యటనలో ఇరుదేశాల ప్రజల ప్రయోజనాల కోసం మరింత సహకారం పెంపొందించుకుంటామని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కోస్ట్ గార్డ్ బేస్ వద్ద ‘మేడ్ ఇన్ ఇండియా’ ద్వారా రూపొందించిన ఆరు అంబులెన్సులు, 10 యూటిలిటీ వాహనాలు, ఐదు లేజర్ రేడియల్ బోట్లను సీషెల్స్‌కు అందజేశారు. దీంతో సముద్ర నిఘా సామర్థ్యాలను మరింత బలోపేతం చేయొచ్చని భావిస్తున్నారు. ఈ పరిణామాన్ని ప్రధాని మోదీ ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. ప్రధాని మోదీ సీషెల్స్‌లో పర్యటించడం ఇది రెండోసారి.