వెనుజులాపై కన్నేసిన అమెరికా అధ్యక్షుడు
ఆయిల్, చమురు నిక్షేపాలను కొల్లగొట్టేందుకు కుట్ర.
వెనిజులా అధ్యక్షుని అరెస్టు చేసినా నోరు మెదపని ప్రధాని మోదీ.
ఉపాదిహామి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగలేదు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
అచ్చంపేట, జనవరి 8: వెనిజులా దేశంలోనీ ఆయిల్, చమురు నిక్షేపాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్ ట్రంప్ కన్నేశారు. వెనిజులా దేశ అధ్యక్షున్ని అమెరికా బంధించిన విషయంపై వివిధ దేశాలు ఖండిస్తున్నప్పటికీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నోరు మెదపడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. గురువారం అచ్చంపేటలో నిర్వహించిన సిపిఎం పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యవక్తగా పాల్గొని మాట్లాడారు. వెనిజులా అధ్యక్షుని బంధించడం సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిపిస్తుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని గతంలో ఈ పథకం అమలు కోసం 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం భరిస్తే, 10% రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవని, కానీ నేడు 60 శాతం నిధులు కేటాయిస్తాం 40 శాతం భరించాలని చెప్పడం దుర్మార్గమన్నారు.
ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలో పేదలు, కూలీలు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను 90% పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రాజెక్టు పూర్తి చేయడానికి 80 వేల కోట్లు అంచనా ఉండగా ఇప్పటివరకు 30 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయని మరి 90 శాతం ప్రాజెక్టు పనులు ఏలా జరిగాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ప్రజా సమస్యల పైన చర్చ జరగలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. హైదరాబాదు పరిసరాలలో డ్రగ్స్ పెద్ద మొత్తంలో బయటపడడం ఆందోళన కలిగిస్తుందని యువత తీవ్రంగా నష్టపోతారని అధికార యంత్రాంగం కట్టడి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజల సమస్యల పైన ఉద్యమాలు, పోరాటాలు చేయాలని పార్టీ జిల్లా కమిటీలకు సూచించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, దేశ్యానాయక్, శంకర్ నాయక్, మల్లేష్, సైదులు, ఆంజనేయులు ఉన్నారు.




