09-01-2026 12:00:00 AM
నాగర్‌కర్నూల్, జనవరి 8 (విజయక్రాంతి): రోడ్డు భద్రత నియమాల పట్ల ప్రతి ఒక్కరికి సంపూర్ణ అవగాహన ఉంటే తప్పనిసరిగా రోడ్డు ప్రమాదాలను నివారించగలుగుతామని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏ. శ్రీదేవి అన్నారు. గురువారం రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ బీసీ గురుకుల బాలికల పాఠశాలలో రోడ్డు సురక్ష అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై కనీస అవగాహన కలిగి ఉండాలని, ట్రాఫిక్ నియమాలు, సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్ను తప్పనిసరిగా పాటిస్తూ తమ తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు.
ఆర్టీఓ, పోలీస్, ట్రాఫిక్, ఆర్టీసీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో హెల్మెట్ లేని వారికి పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని, ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. వారితో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, డీటీఓ చిన్నబాలు, ఏఎంవీఐలు రాజశేఖర్, మనోజ్ కుమార్, ఎస్త్స్ర గోవర్ధన్, ఆర్టీసీ డిపో మేనేజర్ యాదయ్య పాల్గొన్నారు.