20 August, 2026 | 11:38 AM

హరితహారంలో అలంకార మొక్కలకు చెల్లు!

15-06-2024 12:33 AM
  • పండ్ల మొక్కలు, భారీ వృక్షాల మొక్కలు నాటేందుకు సన్నద్ధం 

మొక్కల సంఖ్యను 13 కోట్లకు కుదించాలని సర్కార్ నిర్ణయం 

ఇప్పటికే 8 విడతలుగా 273 కోట్ల మొక్కలు నాటిన అటవీశాఖ 

ప్రతి ఏటా 20 కోట్లకు పైగా మొక్కలు నాటిన ప్రభుత్వం 

రాష్ట్రంలో 7.7 శాతం పెరిగిన పచ్చదనం 

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): అడవులు పెంచడం.. రాష్ట్రంలో పచ్చదనం పరిచేందుకు ప్రతి ఏటా ప్రభుత్వాలు కోట్లాది మొక్కలను నాటుతున్నాయి. ఈ నెల  రెండు లేదా మూడో వారంలో మొక్కలు నాటేందుకు అన్ని శాఖలను సమన్వయం చేస్తూ  ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.  అయితే నాటే మొక్కల సంఖ్యను భారీగా కుదించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏటా 19 కోట్ల నుంచి 20 కోట్ల మొక్కలను రాష్ట్ర వ్యాప్తంగా నాటుతుండగా, ఈ ఏడాది మాత్రం 13 కోట్ల మొక్కలే లక్ష్యంగా పెటుకొంది. అయితే గత ప్రభుత్వం నామకరణం చేసిన  హరితహారం పేరును కూడా మార్చాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అటవీశాఖ ఇప్పటికే కొన్ని పేర్లను సూచించగా, రాష్ట్ర ప్రభత్వుం త్వరలో అధికారికంగా ప్రకటించనుంది.

అయితే గతంలో నాటిన అలంకారణ మొక్కల కంటే ఈ ఏడాది భారీగా ఉండే వృక్షాలు, పళ్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సంబంధిత అధికారులు చెబుతున్నారు. అలంకార మొక్కలు సంఖ్యను పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతాయని, పండ్లు, ఫలాలు ఇచ్చే  మొక్కలు, ఇతర భారీ వృక్షాలను పెంచితే పక్షులు, కోతులు, ఇతర జంతుజాలాలకు ఆహారంగా ఉపయోగపడుతాయనే ఆలోచనతో ఉన్నారు. దీంతో ఇళ్లలోకి వచ్చే కోతుల బెడదను నివారించడానికి కూడా అవకాశం ఉంటుందని సర్కార్ ఆలోచన. 

 కాగా, వారం, పది  రోజుల్లో  మొక్కలు నాటే  కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా అటవీశాఖ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది 19.29 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యం పెట్టుకోగా, 30.29 కోట్ల మొక్కలు నాటారు. ప్రస్తుతం మొక్కలు నాటేందుకు స్థలాల లభ్యత సవాల్‌గా మారడంతో లక్ష్యాన్ని కుదించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ హరితహార కార్యక్రమాన్ని 2015 జూలై 15న అప్పటి ప్రభుత్వం ప్రారంభించగా, ఇప్పటివరకు రూ. 10,822 కోట్ల వ్యయంతో రాష్ట్ర  వ్యాప్తంగా 273 కోట్ల మొక్కలు నాటారు. దీంతో  మూడో అతిపెద్ద పర్యావరణ పరిక్షణకు ప్రత్యామ్నాయంగా హరితహారం గుర్తింపు పొందింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం 7.7 శాతం పెరిగిందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. భవిష్యత్‌లో రాష్ట్రంలో పచ్చదనం మరింతగా పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందిచినట్లుగా చెబుతున్నారు.