20 August, 2026 | 12:31 PM

చిన్నారుల ఆరోగ్యానికి యోగా!

15-06-2024 12:00 AM

మా బాబు హైట్ పెరగడం లేదు.. మా పాప చదువుపట్ల కాన్సంట్రేట్ చేయడం లేదు.. మా పిల్లలు ఒక్క దగ్గర క్షణం కూడా కుదుటగా ఉండలేకపోతున్నారు.. ఇలా తల్లిదండ్రులు పిల్లల విషయంలో గందరగోళానికి గురవుతుంటారు. అలా ఆందోళపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుత బిజీ ప్రపంచంలో పిల్లలను ఓ దగ్గర కుదుటగా ఉంచటానికి ఒకే ఒక మార్గం ‘యోగా’.  యోగా చేయడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరగడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రతిరోజు కనీసం ఓ పది నిమిషాలు యోగా ఆసనాలు చేసినా సరిపోతుందని యోగా నిపుణులు చెబుతున్నారు. కింద పేర్కొన్న ఆసనాలు చేయడం వల్ల పిల్లలు ఎత్తు పెరగడంతో పాటు మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవుతారు. పిల్లల్లో యోగా ఆసనాల వల్ల కలిగే ప్రయోజనాలెంటో తెలుసుకుందాం..

భ్రమరీ ప్రాణాయామం..

ఎలా చేయాలి

దీన్ని హమ్మింగ్ బీ బ్రీత్ అని కూడా పిలుస్తారు. పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చోవాలి. అర చేతులను ముఖం మీద ఆనించి.. చూపుడు వేళ్లతో కళ్ల మీద నెమ్మదిగా నొక్కాలి. మధ్య వేళ్లను ముక్కు పక్కల, ఉంగరం వేళ్లను పెదాల మీద, చిన్న వేళ్లను నోరు కింద తాకించి ఉంచాలి. బొటన వేళ్లతో నెమ్మదిగా చెవులను మూయాలి. ఇప్పుడు ముక్కతో గాఢంగా శ్వాస తీసుకొని.. మ్.. మ్.. అని శబ్దం చేస్తూ గాలిని వదలాలి.

ఉపయోగాలు

  1. ఈ ఆసనం ప్రతిరోజు చేయడం వల్ల నాడీ వ్యవస్థ పనితీరు ప్రశాంతంగా ఉంటుంది. 
  2. ఇదొక ప్రశాంతమైన శ్వాస ప్రక్రియ. 
  3. పిల్లల్లో ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది. 
  4. కండరాలు బలంగా తయారవుతాయి. 
  5. సైనస్ సమస్యను తగ్గిస్తుంది. 
  6. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

శీతలీ ప్రాణాయామం..

ఎలా చేయాలి

మీ చేతులు మోకాళ్లపై ఉంచి 

సుఖసన, పద్మాసనలో కూర్చోవాలి. నాలికను ముందుకు చాపి, గొట్టంలా మడిచి నోటి ద్వారా గట్టిగా శ్వాస 

లోనికి పీల్చి, నోరు మూయాలి. తరువాత గాలిని ముక్కు రంధ్రా ద్వారా బయటకు వదలాలి. ఈ ఆసనం ప్రతిరోజు పది నిమిషాలు చేస్తే సరిపోతుంది.

ఉపయోగాలు

  1. శారీర వేడిని తగ్గిస్తుంది.
  2. కోపాన్ని నియంత్రిస్తుంది.
  3. అజీర్తి సమస్యను దూరం చేస్తుంది.
  4. నోరు, గొంతు, ముక్కు సమస్యలకు మంచి చికిత్స చేస్తుంది.
  5. ఎండోక్రైన్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది. 
  6. ఈ ఆసనం చేయడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

తడాసనం..

ఎలా చేయాలి

పాదాలను కొంచెం దూరంగా ఉంచి నిల్చోవాలి. ఇప్పుడు శ్వాస పీల్చుకోవాలి. తరువాత తల మీదుగా చేతులను పైకి ఎత్తాలి. పైకి ఎదురుగా ఉన్న అరచేతులతో వేళ్లను ఇంటర్‌లాక్ చేయాలి. శ్వాస వదులుతూ భుజాలను చెవుల వైపు పైకి లేపాలి. మీ భుజాలను వెనుకకు రోల్ చేసి వెన్నెముక వైపు తిప్పాలి. ఛాతీని పెద్దగా చేసి, భంగిమను బలోపేతం చేయాలి. ముఖం, కంటి కండరాలన్నింటీని రిలాక్స్ కోసం భంగిమను స్థిరంగా కొనసాగించండి. సాధారణ స్థితికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి.

ఉపయోగాలు

  1. తడాసనం గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 
  2. కండరాల బలాన్ని పెంచుతుంది.
  3. ఎత్తు పెరుగుతారు. 
  4. ఏకాగ్రత పెరుగుతుంది.

చక్రాసనం..

ఎలా చేయాలి

చక్రాసనం వేయడానికి మొదట వెల్లకిలా పడుకోవాలి. తరువాత కాళ్లు మడిచి, చేతులను భుజాల కిందుగా ఆనించి, కొద్దిగా శ్వాస పీల్చి కుంభించి నడుమును వీలైనంత పైకి ఎత్తాలి. మెడ కిందికి వేలాడుతుండాలి. కొద్ది క్షణాలు ఈ స్థితిలో ఉన్న తర్వాత మెల్ల మెల్లగా తలను నేలపై ఆనించి నడుమును కూడా ఆనించాలి. తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి.

ఉపయోగాలు

  1. చేతులు, భుజాలు, మోకాళ్లు, తొడలు, మణికట్టు దృఢంగా తయారవుతాయి. 
  2. పొత్తి కడుపు కండరాలు బలంగా మారతాయి. 
  3. ముఖంలో కాంతి పెరుగుతుంది. 
  4. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. 
  5. అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్య, మలబద్ధకం పోతాయి.

పాజిటివ్ వైబ్స్ కోసం..

పిల్లలు యోగా చేయడం ద్వారా పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. మానసికంగా దృఢంగా తయారవుతారు. ఏకాగ్రత పెరుగుతుంది. చిన్నతనం నుంచే యోగ చేయడం వల్ల ఎముకల పెరుగుదలకు, కండరాల దృఢత్వానికి మరీ ముఖ్యంగా శరీరాకృతి అందంగా టోన్ అవుతుంది. ముఖ్యంగా యోగా చేసేవాళ్లల్లో ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి. ఫిజికల్లీ, మెంటల్లీ ఫిట్‌గా ఉంటారు. పిల్లల్లో ఏకాగ్రత, హైట్ పెరగడానికి యోగ చక్కటి ఔషధం. ఆసనాల వల్ల ఒక్క ఉపయోగం అని చెప్పలేం. ఇది రోగాలకు చక్కటి మెడిసిన్‌లా పని చేస్తుంది. హైపర్ యాక్టివ్.. మోమొరీ లాస్ ఉన్న పిల్లలు యోగా చేయడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి యోగ చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. యోగ చేయడం వల్ల మంచి జీవన శైలి అలవడుతుంది. 

 అనిత అత్యాల,

అనిత యోగ అకాడమీ 

6309800109

 జాబిలి