3 August, 2026 | 3:24 AM

టీజీ కాంగ్రెస్‌లో రేసుగుర్రం.. వంశీచంద్‌రెడ్డి

03-08-2026 01:48 AM
  1. అధిష్ఠానం వద్ద పెరుగుతున్న ప్రాధాన్యం
  2. కల్వకుర్తి నుంచి మొదలు కొని ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వరకు ఒకే పేరు  చల్లా...
  3. ఆచితూచి అడుగులు వేస్తున్న చల్లా వంశీ చందర్ రెడ్డి 

రంగారెడ్డి, ఆగస్టు 2(విజయక్రాంతి): ఇటీవల ఢిల్లీ లో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం తర్వాత తెలంగాణ రాజకీయా ల్లో ఏఐసీసీ నేత  మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచందర్ రెడ్డి పై ఫుల్ చర్చ సాగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ అంతర్గత వర్గాల్లో ఆ యన ప్రాధాన్యం ఒక్కసారిగా పెరిగింది. ఒకవైపు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంటే, మరోవైపు ఢిల్లీ వేదికగా ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల్లో వంశీచంద్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు. ఢిల్లీ పెద్దలకు నమ్మినబంటు గా  గత కొన్ని ఏళ్లుగా ఏఐసీసీలో కీలక బాధ్యతలు లో నిమగ్నం అయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు అత్యంత సన్ని హితుడిగా పేరొందిన వంశీచంద్ రెడ్డి, జాతీ య స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

డీసీసీ అధ్యక్షుల నియామకం: 

 గత ఏడాది క్రితమే దేశవ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ ) అధ్యక్షుల నియామక ప్రక్రియ, వారి పనితీరును సమీక్షించే అత్యంత కీలక బాధ్యతలను ఏఐసీసీ ఆయనకు అప్పగించింది. పార్టీ నియామకాలు, నివేదికల తయారీలో కీలకపాత్ర పోషిస్తూ అధిష్ఠానం వద్ద ప్రత్యేక నమ్మకాన్ని సంపాదించుకున్నారు.

ఢిల్లీలో ఏం జరుగుతోంది?..

గత కొంతకాలంగా ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డికి, వంశీచంద్ రెడ్డికి మధ్య అభిప్రా య బేధాలు ఉన్నాయనే వార్తలు పార్టీ వర్గా ల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. అ యితే, ఇటీవల ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థా యి సమావేశ దృశ్యాలు ఈ ప్రచారాలకు భిన్నమైన చిత్రాన్ని చూపించాయి.సీఎం రే వంత్ రెడ్డి, పలువురు మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు పాల్గొన్న అధికారిక సమన్వయ సమావేశంలో వంశీచంద్ రెడ్డి ప్రాధాన్యత స్పష్టంగా కనిపించింది.

కాంగ్రెస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఆయన ము ఖ్యాంశంగా ఉన్న ఫోటోలు ప్రచారం కావ డం యాదృచ్ఛికం కాదని, హైకమాండ్ ఇచ్చే ‘పవర్ సిగ్నల్’ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వంలో చేపట్టే నామినేటెడ్ పోస్టులు, కీలక నియామకాలకు ఈ స మన్వయ కమిటీ ఆమోదం తప్పనిసరి కావడంతో, రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయాల్లో వంశీ పాత్ర మరింత బలీయంగా మారనుంది.

విద్యార్థి నేత నుంచి ఏఐసీసీ స్థాయి వరకు..

మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం శేరి అప్పారె డ్డిపల్లికి చెందిన వంశీచంద్ రెడ్డి ప్రస్థానం ఎంతో ఆసక్తికరమైనది. ఎన్‌ఎస్యూఐ తో ఆయన రాజకీయ ప్రయాణం మొదలైం ది.విద్యార్థి నాయకుడిగా ఎన్‌ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, యువజన కాంగ్రెస్లో చురుగ్గా పనిచేశారు.

2014 లో చట్టసభలోకి....

 కల్వకుర్తి నియోజకవర్గం నుంచి తొలి సారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి, సమీప బీజేపీ అభ్యర్థి తల్లోజి ఆచారిపై స్వల్ప మెజార్టీతో విజయం సాధించి చట్టసభల్లోకి అడుగు పెట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ, అధిష్ఠానం ఆయన సేవలను గుర్తించి ఢిల్లీకి పిలిపించింది. ఏఐసీసీ ఇన్ఛా ర్జ్ కేసీ వేణుగోపాల్తో కలసి పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యత అప్పగించింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానం నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి డి.కె. అరుణ చేతిలో హోరాహోరీ పోరులో ఓటమి చెందారు.ఓటమి ఎదురైనా నిరాశ చెందకుండా ఒకవైపు ఏఐసీసీ బాధ్యతలు చూస్తూనే, మరోవైపు కల్వకుర్తి, మహ బూబ్ నగర్, హైదరాబాద్లలో స్థానిక కార్యకర్తలకు, శుభకార్యాలకు నిరంతరం అందు బాటులో ఉంటున్నారు.

పార్టీలో బ్యాలెన్స్ ఆఫ్ పవర్’కు శ్రీకారం..

తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు కేవలం పదవుల నియామకాలకు మాత్రమే పరిమితం కావు. రాష్ట్ర పాలనలో, పార్టీ నిర్మాణంలో ఢిల్లీ అధిష్ఠానం తన పట్టును నిలుపుకోవడానికి వంశీ చంద్ రెడ్డి వంటి యంగ్ అండ్ డైనమిక్ నా యకులను ఒక సమర్థవంతమైన మార్గంగా వాడుకుంటోందనే విశ్లేషణలు ఉన్నాయి. ఒకవైపు ప్రాంతీయంగా రేవంత్ రెడ్డికి ఉన్న మాస్ ఇమేజ్, మరోవైపు అధిష్ఠానంతో వంశీచంద్ రెడ్డికి ఉన్న సత్సంబంధాలు ఈ రెండింటి కలయిక తెలంగాణ కాంగ్రెస్ను మున్ముందు ఏ దిశగా తీసుకెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. నామినేటెడ్ పోస్టులు, జిల్లా కమిటీల నియామకాల్లో వంశీ మార్క్ ఎంతవరకు ఉంటుందో వేచి చూడాలి.