వీబీజీ రాంజీ ఉద్యోగుల సమరభేరి
*12 డిమాండ్ల సాధనకు జేఏసీ కార్యాచరణ
*ఆగస్టు 15 వరకు పెన్ డౌన్
*పే స్కేల్.. ప్రమోషన్లు.. అలవెన్సుల పెంపునకు డిమాండ్
మహబూబాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): గ్రామీణాభివృద్ధి శాఖలోని వీబీ - జీ రాంజీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ గ్రామీణాభివృద్ధి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోని నూతన జాయింట్ యాక్షన్ కమిటీ (జే ఏ సీ) ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో విధులు నిర్వహించే ఏ పీ ఓ, ఇంజనీరింగ్ కన్సల్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, బీర్ ఫుడ్ టెక్నీషియన్, రాష్ట్ర కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులు సుమారు 4000 మందికి పైగా వేతనాలు, పదోన్నతులు, అలవెన్సులు, సర్వీస్ అంశాలు, సామాజిక భద్రత తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతిపత్రాలు సమర్పించి, పెన్ డౌన్ ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
20 ఏళ్లుగా పనిచేస్తున్నా కనీస వేతనం అమలు చేయడం లేదని, ప్రతినెల సమయానికి వేతనాలు చెల్లించడం లేదని, ఎటువంటి పదోన్నతులు లేవని, స్థిరమైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధి హామీ పథకం అమలులో చేపట్టిన సిమెంట్ రోడ్లు, స్మశాన వాటికలు, పాఠశాలల తరగతి గదులు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు, గ్రామపంచాయతీ కార్యాలయాల భవనాలు, మహిళా సమాఖ్య భవనాలు, సెగ్రిగేషన్ షెడ్లు, నర్సరీల నిర్వహణ లాంటి అనేక పథకాలను విజయవంతంగా నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపినప్పటికి తమకు ఆ మేరకు గుర్తింపు లేదని వాపోతున్నారు. సమయపాలన లేదు, ఇతర విభాగాల అధికారుల మాదిరిగా సెలవులు లేవు, అయినప్పటికీ భవిష్యత్తుపై ఆశతో విధులు నిర్వహిస్తున్న తమకు పథకం పేరు మార్చినప్పటికీ, కార్యక్రమాన్ని నిర్వహించడంలో కీలకపాత్ర వహిస్తున్న తమకు మాత్రం ఆశించిన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
12 డిమాండ్లతో ఉద్యమం
వీ బీ - జీ రాంజీ పరిధిలో పనిచేస్తున్న సాంకేతిక, ఇతర విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తగిన పే స్కేల్ అమలు చేయాలని ఉద్యోగ సంఘం డిమాండ్ చేస్తోంది. ప్రమోషన్లతో కూడిన కెరీర్ అడ్వాన్స్మెంట్ పాలసీని అమలు చేయాలని, కేడర్ బలం, సర్వీస్ సీనియారిటీ, ఉద్యోగంలో చేరిన తేదీలను సక్రమంగా నిర్ణయించాలని కోరుతోంది. సీ వో, ఏ ఏ లకు ప్రత్యేక అలవెన్స్ను రూ.5 వేల వరకు, ఫీల్ సిబ్బందికి ఫికస్డ్ ట్రావెలింగ్ అలవెన్స్ను రూ.6 వేల వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఫీల్ లెవ, మండల్ లెవెల్, జిల్లా స్థాయి సిబ్బందికి ఓవర్టైమ్ అలవెన్స్ ఇవ్వాలని కోరుతున్నారు.
పే మ్యాట్రిక్స్ ప్రకారం ఉద్యోగుల ఇన్క్రిమెంట్లు, గ్రేడ్లను పునః నిర్ణయించాలని, 2013లో ఏపీవోలు, సీ వో, ఏ ఏ లు, టెక్నికల్ అసిస్టెంట్లు, అదనపు డీ ఆర్ పీ లు, ప్లాంటేషన్ సూపర్వైజర్లకు అమలు కాలేదని పేర్కొన్న గ్రేడ్లు, ఇన్క్రిమెంట్లు, ఫిట్మెంట్లను అమలు చేయాలని సంఘం కోరుతోంది.అన్ని విభాగాల ఫీల్ సిబ్బందికి గ్రాట్యుటీ ప్రయోజనాలు కల్పించాలని, ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం ఈ పీ ఎఫ్ ను పునఃనిర్ణయించాలని, నాన్- ఎఫ్ టీ ఈ ఉద్యోగులను, ఎఫ్ టీ ఈ లుగా మార్చాలని డిమాండ్ చేస్తోంది. అటెండర్ల హానరేరియం పెంచాలని, అన్ని విభాగాల ఉద్యోగులకు ఎంప్లాయ్ హెల్త్ స్కీం అమలు చేయాలని కోరుతున్నారు.
దశలవారీగా సమర కార్యాచరణ
జూలై 27 నుంచి మండల స్థాయిలో ఎంపీడీవో, పీఓ లకు, జిల్లా స్థాయిలో కలెక్టర్లు, డిఆర్డిఓ, జెడ్పి సీఈవో లకు వినతిపత్రాల సమర్పణ చేపట్టారు. జూలై 30న నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుత నిరసన నిర్వహించారు. జూలై 31, ఆగస్టు 1న పెన్డౌన్, షట్డౌన్, కార్యాలయ పనుల్లో సహాయ నిరాకరణ కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఆగస్టు 3న హైదరాబాద్లోని సీ ఆర్ డి కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన, ఆగస్టు 4న మంత్రులకు వినతిపత్రాల సమర్పణ చేపట్టనున్నట్లు జేఏసీ ప్రకటించింది. అనంతరం ఆగస్టు 5 నుంచి 8 వరకు, ఆగస్టు 10 నుంచి 15 వరకు పెన్డౌన్, షట్డౌన్, సహాయ నిరాకరణ కార్యక్రమాలను కొనసాగించనున్నట్లు షెడ్యూల్లో పేర్కొంది.
పరిష్కారం లేకుంటే ఉద్యమం ఉధృతం
ఉద్యోగుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలి. సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ప్రొటెస్ట్, పెన్డౌన్, ధర్నా లాంటి ప్రత్యక్ష ఆందోళనకు నిర్వహిస్తాం. ఎన్నో ఏళ్లుగా ఉపాధి హామీ పథకంలో కీలకపాత్ర నిర్వహిస్తున్నాం. పే స్కేల్ ప్రకటించాలి. ఇతర అలవెన్స్ లు అమలు చేయాలి. హెల్త్ కార్డులు ఇవ్వాలి. ప్రతినెల క్రమం తప్పకుండా వేతనం చెల్లించాలి. సమస్యలు పరిష్కరించనట్లయితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం.
-ఎడ్ల యాకాంబ్రం, ఈ జీ ఎస్, జే ఏ సీ, జిల్లా కన్వీనర్, మహబూబాబాద్






