భక్తిశ్రద్ధలతో వాసవీ మాత జన్మదిన వేడుకలు
అమ్మవారికి బంగారు కిరీటం అలంకరణ
కల్వకుర్తి ఏప్రిల్ 26 : వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మాఘ శుద్ధ దశమి సందర్భంగా అమ్మవారి పుట్టినరోజు వేడుకలు ఆదివారం జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేకువ జామున సుప్రభాత సేవతో ఉత్సవాలను ప్రారంభించి అభిషేకాలు నిర్వహించారు. గీతా పారాయణం, హనుమాన్ చాలీసా పటించారు.
అనంతరం పల్లకి సేవ నిర్వహించి సామూహిక కుంకుమార్చన చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు దేవాలయానికి విచ్చేసి ఉత్సవాల లో పాల్గొన్నారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ జూలూరు రమేష్ బాబు ఆధ్వర్యంలో అమ్మవారి డోలహరణం నిర్వహించారు. అమ్మవారిని ఉయ్యాలలో ఉంచి భక్తులు జన్మదినం వేడుకలు నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి మాత విగ్రహాన్ని బంగారు కిరీటంతో అలంకరించారు.
ఆలయ ఆచార ప్రకారం కిరీటాన్ని డప్పు వాయిద్యాలతో ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, మాజీ వైస్ ఎంపీపీ కొండూరు గోవర్ధన్, మండల ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు గంధం ప్రసాద్, పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు వాస శేఖర్, అధ్యక్షుడు బాదం హరీష్, వనిత క్లబ్ అధ్యక్షురాలు బాదం సాయి లక్ష్మి తదితరులతో పాటు అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు.






