గద్వాలలో సంచలనం..
అధికారుల నిర్లక్ష్యంతో బాల్య వివాహం, చెల్లిని తీసుకెళ్లడంతో అసలు వధువుకు పెళ్లి పూర్తి
గద్వాల, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): బాల్య వివాహాలను అరికట్టాల్సిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా గద్వాల జిల్లాలో ఓ సంచలన ఘటన ఆదివారం సోషల్ మీడి యా చక్కర్లు కొడుతూ వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికకు జరగాల్సిన వివాహాన్ని అడ్డుకోవడంలో విఫలమైన అధికారులు, అసలు వధువును గుర్తించకపోవడంతో ఆమె చెల్లినే సంరక్షణ కేంద్రానికి తరలించడం వివాదాస్పదమైంది. ఇదే అవకాశంగా తీసుకున్న పెద్దలు, మైనర్ బాలికకు గుడిలో పెళ్లి జరిపించడంతో ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగింది?....
ధరూర్ మండలానికి చెందిన ఓ యువకుడితో గద్వాల మండలంకు చెందిన మైనర్ బాలికకు వివాహం నిశ్చయించారు. ఈ నెల 24 (గురువారం) ఉదయం పెళ్లి జరగాల్సి ఉండగా, బుధవారం రాత్రి ఈ విషయం ఐసీడీఎస్ అధికారులకు చేరింది. వెంటనే స్పందించిన అధికారులు పెళ్లి జరుగుతున్న గ్రామానికి చేరుకున్నారు. అయితే అధికారుల రాక సమాచారం అందడంతో పెద్దలు ముందస్తుగా మైనర్ వధువును అక్కడి నుంచి దాచేశారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన అధికారులకు పరిస్థితిని సరిగా పరిశీలించకుండా, అక్కడ ఉన్న మరో బాలికను వధువుగా భావించారు.
తప్పిదం ఎక్కడ జరిగింది?.....
వధువుకు సంబందించిన పెళ్లి పత్రిక, ఆధార్ కార్డు వంటి ప్రాథమిక ధృవపత్రాలు పరిశీలించకుండా, వధువు చెల్లినే అసలు వధువు అని భావించి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నమ్మాయిని సంరక్షణ కేంద్రానికి తరలించగా, పెద్దలు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.
అసలు వివాహం ఎలా జరిగింది?
అధికారులు వెళ్లిన వెంటనే, దాచిన మైనర్ బాలికను బయటకు తీసుకొచ్చి గుడిలో పెళ్లి జరిపించారు. అధికారులు చేసిన పొరపాటు వల్ల బాల్య వివాహం అడ్డుకట్ట లేకుండా పూర్తయ్యింది.
ఆలస్యంగా స్పందించిన అధికారులు
ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో గురువారం తెల్లవారుజామున అడిషనల్ ఎస్పీ, స్థానిక ఎస్త్స్రలు, ఐసీడీఎస్ సిబ్బంది వరుడు ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పటికే వధూవరులు గ్రామం విడిచిపెట్టారు. ప్రస్తుతం వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని సమాచారం.
స్థానికుల ఆగ్రహం ....?
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాల్య వివాహాల నివారణలో ఇలాంటి తప్పిదాలు ఆందోళనకరమని సామాజిక వర్గాలు పేర్కొంటున్నాయి.






