calender_icon.png 8 June, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీరమల్లు మళ్లీ వాయిదా

07-06-2025 12:00:00 AM

సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. ఈ సినిమా మరోమారు వాయిదా పడింది. ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీలను ప్రకటించిన మేకర్స్ మరోసారి అంటూ మళ్లీ ఊరిస్తున్నారు. దీంతో ఈ సినిమా విడుదల తేదీ విషయమై నెట్టింట విమర్శనాత్మకమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు స్పందిస్తూ అప్‌డేట్ విషయమై ఓ ప్రకటన విడుదల చేశారు.

“హరిహర వీరమల్లు’ సినిమాను గతంలో ప్రకటించిన జూన్ 12వ తేదీకి మీ ముందుకు తీసుకురావడానికి అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తున్నాం. అయినప్పటికీ ఆ తేదీకి చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురాలేకపోతున్నామని తెలియజేస్తున్నాం. కష్టమైనయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మరింత గొప్పగా మలచాలనేదే మా ప్రయత్నం.

ప్రతి ఫ్రేమ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అద్భుతమైన చిత్రంగా మలిచే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాం. అందుకే మేము మరి కొంత సమయం తీసుకుంటున్నాం. థియేట్రికల్ ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. ట్రైలర్‌తోపాటు, కొత్త విడుదల తేదీని కూడా తెలియజేస్తాం” అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఏఎం జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.

కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞాన శేఖర్ వీఎస్, మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏఎం రత్నం సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు ఏ దయాకర్‌రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.