బెల్లం రవాణా చేస్తున్న వాహనం స్వాధీనం
- 6 క్వింటాళ్ల బెల్లం,120 కిలోల పట్టిక పట్టివేత-
- ఒకరిపై కేసు నమోదు
కల్వకుర్తి జులై 29: కల్వకుర్తి ఎక్సైజ్ అధికారులు బుధవారం సారా తయారీకి వినియోగించే బెల్లం రవాణా చేస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ వెంకట్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి మన్ననూర్కు స్కార్పియో వాహనంలో బెల్లం తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో హైదరాబాద్‌శ్రీశైలం జాతీయ రహదారిపై వెల్దండ మండల పరిధిలో వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా వెళ్తున్న స్కార్పియో వాహనాన్ని ఆపి పరిశీలించగా,
అందులో 6 క్వింటాళ్ల బెల్లం,120 కిలోల పట్టికను గుర్తించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారించగా రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మొగిలి తండాకు చెందిన ఇస్లావత్ రాజు బెల్లాన్ని రవాణా చేస్తున్నట్లు నిర్ధారణ కావడంతో అతనిపై కేసు నమోదు చేసి, బెల్లంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ సిబ్బంది జనార్దన్రెడ్డి, సిద్ధార్థ్, చందూలాల్ తదితరులు పాల్గొన్నారు.






