24 July, 2026 | 9:37 PM

మోదీ వ్యతిరేక తీర్పు

05-06-2024 01:49 AM

న్యూఢిల్లీ, జూన్ 4: ప్రధాని నరేంద్రమోదీ వర్సెస్ ప్రజలు అన్న తీరులో ఎన్నికలు జరిగాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఇది మోదీ వ్యతిరేక తీర్పు అని, ఆయన నైతికంగా ఓటమి పాలయ్యారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ మీడియా సమావేశం ఢిల్లీ లో మంగళవారం ఏర్పాటు చేసింది. కాంగ్రె స్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఖర్గే, జైరాం రమేశ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఖర్గే మాట్లాడుతూ.. ఈసారి ప్రజలు ఏ ఒక్క పార్టీకి మెజారిటీ ఇవ్వలేదన్నారు.

ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజే పీకి కూడా దక్కలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు. ప్రజాతీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నామని స్పష్టం చేశారు. మొదటినుంచి తాము సానుకూల దృక్పథంతోనే ప్రచారం చేశామని, దేశంలోని సమ స్యలను ప్రస్తావించామని తెలిపారు. ఈ నేపథ్యంలో చాలామంది తమకు మద్దతిచ్చారని తెలిపారు. రాహుల్‌గాంధీ చేసిన రెండు యాత్రల్లో ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడామని, వాళ్ల సమస్యలు తెలుసుకున్నామని పేర్కొన్నారు. వాటి ఆధారంగానే మ్యానిఫెస్టోను రూపొందించామని వెల్లడించారు.

రాజ్యాంగాన్ని కాపాడాం..

అనంతరం రాహుల్‌గాంధీ మాట్లాడు తూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే యుద్ధం చేశామన్నారు. తమ పోరాటాన్ని ప్రజలు స్వాగతించారని తెలిపారు. ఎన్నికలకు ముందు తమ బ్యాంకు ఖాతాలు సీజ్ బీజేపీ చేసిందని, ముఖ్యమంత్రులను జైలు కు పంపారని గుర్తు చేశారు. అన్ని వ్యవస్థలు తమకు వ్యతిరేకంగా పనిచేశాయని, అయినా కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని పేర్కొన్నారు. తాము కేవలం మోదీ, అమిత్‌షాలతో పోరాడలేదని, అన్ని వ్యవస్థలతో పోరాడాల్సి వచ్చిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అద్భుతంగా పోరాడిందన్నారు.

రాజ్యాంగాన్ని కాపాడటంలో తొలి విజయం సాధించామని, మోదీని దేశ ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. ఈ ఎన్నికలను ప్రభుత్వ వ్యవస్థలు, నిఘా సంస్థలపై చేసిన యుద్ధంగా భావిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వ ఏర్పా టుపై అడిగిన ప్రశ్నపై రాహుల్ మాట్లాడు తూ.. బుధవారం ఇండియా కూటమి పార్టీలతో భేటీ అవుతాం. ఈ ప్రశ్నలకు సమాధా నం అక్కడ చెబుతాం. మా భాగస్వామ్య పార్టీలతో చర్చించకుండా మేం ఎలాంటి ప్రకటనలు చేయలేం అని స్పష్టం చేశారు.