24 July, 2026 | 10:23 PM

ఎన్డీయే అధికారం పదిలం

05-06-2024 01:45 AM

మెజారిటీ మార్కు కోల్పోయిన బీజేపీ..  సొంతంగా 240 సీట్లకే పరిమితం

ఎన్డీయే కూటమికి 292 స్థానాలు

ఏమాత్రం పనిచేయని 400 సీట్ల ప్రచారం

ఓట్లు రాల్చని అయోధ్య రామ మందిరం

మందిరం ఉన్న సెగ్మెంట్‌లో బీజేపీ ఓటమి

యూపీలో సగానికి సగం తగ్గిన బలం

అంచనాల మించిన ఇండియా కూటమి

కాంగ్రెస్‌కు సొంతంగా 99 స్థానాలు

ఇండియా కూటమికి 232 సీట్లు

ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ కరువు

మూడోసారి ప్రధాని కానున్న మోదీ

బీహార్‌లో నితీశ్‌కు జోరు

ఆంధ్రప్రదేశ్‌ను ఊడ్చేసిన టీడీపీ, జనసేన

వైఎస్ జగన్‌కు ఘోర ఓటమి 

ఉత్కళ దేశంలో ఊపేసిన కాషాయ దళం

తొలిసారి ఒడిశాలో అధికారంలోకి బీజేపీ

న్యూఢిల్లీ, జూన్ 4: లోక్‌సభ ఎన్నికల్లో ఓటరు ఎవరూ ఊహించని తీర్పు ఇచ్చాడు. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలన్నింటినీ తల్లకిందు లు చేస్తూ సంకీర్ణ ప్రభుత్వానికి ఓటేశాడు. 400 సీట్లు సాధిస్తామన్న ఎన్డీయే 300 కూడా సాధించలేకపోయింది. 150 లోపే పరిమితం అవుతుందన్న ఇండియా కూట మి ఏకంగా 233 సీట్లు సాధించింది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి భారీగా లాభపడగా, అధికార బీజేపీ, ఎన్డీయే భారీగా నష్టపోయాయి. ఎన్డీయే కూటమి 291 సీట్లు గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించింది. అయితే, 2019లో సొంతంగానే 303 స్థానాలు గెలుచి సంపూర్ణ మెజారిటీ సాధించిన బీజేపీ, ఈసారి 240 స్థానాలతోనే సరిపెట్టుకొంది. కేంద్రంలో ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో టీడీపీ, జేడీయూ కింగ్‌మేకర్లుగా మారాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో సుదీర్ఘంగా సాగిన లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ఫలితాలు సాయంత్రం వరకు పూర్తిగా వెల్లడయ్యాయి.

ఈసారి ఎన్నికల్లో గతం మాదిరిగానే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 99 సీట్లు గెలిచి ప్రతిపక్ష కాంగ్రెస్ రెండోస్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని మట్టికరి పించిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) 35 సీట్లతో మూడో అతిపెద్ద పార్టీగా ఎదిగింది. మెజారిటీ తగ్గినప్పటికీ బీజేపీ దేశంలో కొన్ని కొత్త ప్రాంతాలకు విస్తరించింది. చరిత్రంలో మొదటిసారి ఒడిశాలో బీజేపీ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. లోక్‌సభతోపాటే జరి గిన అసెంబ్లీ ఎన్నికల్లో 81 స్థానాల్లో విజ యం సాధించి తొలిసారి ఉత్కళ దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నది. మూడు దశాబ్దాలపాటు ఒడిశాను తిరుగులేకుండా ఏలిని బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ కోటను బీజేపీ బద్దలు కొట్టింది. బీజేడీ 48 స్థానాలు మాత్రమే గెలిచి ప్రతిపక్ష హోదాతో సరిపెట్టుకొన్నది. కాంగ్రెస్ పార్టీ 14 ఓట్ల విజయం సాధించింది. తెలంగాణలో బీజేపీ అద్భుతంగా పుంజుకొన్నది. మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 8 చోట్ల గెలిచి కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చింది. పదేండ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్‌ఎస్ లోక్‌సభ ఎన్నికల్లో ఖాతా తెరువలేకపోయింది.

మరో తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభంజనం కొనసాగింది. జనసేన, బీజేపీతో కలిసి కూటమిగా పోటీచేసిన సైకిల్ పార్టీ.. సొంతంగానే 136 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని తిరుగులేని మెజారిటీ సాధించింది. జనసేన కూడా అద్భుత విజయం అందుకొన్నది. ఆ పార్టీ పోటీచేసిన 21 చోట్లా విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఏపీలో బీజేపీ కూడా అనూహ్య విజయం అందుకొన్నది. ఆ పార్టీ 8 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. అధికార వైఎస్‌ఆర్సీపీ ఘోర ఓటమి మూటగట్టుకొన్నది. గత ఎన్నికల్లో 150కి పైగా సీట్లు సాధించిన ఆ పార్టీ.. ఈసారి 10 స్థానాలకు పడిపోయింది. నాలుగు లోక్‌సభ సీట్లు గెలుచుకొన్నది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 9న ఏపీకి సీఎంగా ప్రమా ణం చేయనున్నారు. మొత్తంగా ఈసారి బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా మినహా బీజేపీ కంచుకోటల్లాంటి రాష్ట్రాల్లో ఇండియా కూటమి స్పష్టమైన ధిపత్యం ప్రదర్శించింది.  

ఖేదం.. మోదం

లోక్‌సభ ఎన్నికల ప్రారంభంలో ప్రతిపక్షాలు బలహీనంగా కనిపించటంతో సొంతం గానే 370 సీట్లు గెలుస్తామని, ఎన్డీయే కూటమిగా 400 ఎంపీలు గెలుస్తామని బీజేపీ ధీమా వ్యక్తంచేసింది. చార్‌సౌ పార్ అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ప్రధాని మోదీసహా ఆ పార్టీ నేతలంతా 400 సీట్లు సాధిస్తామని ఘంటాపథంగా చెప్పా రు. ఎన్నికలు ముగిసిన మరుక్షణం వెలువడిన ఎగ్జిట్‌పోల్స్ అన్నీ ఎన్డీయే కూటమి దాదాపు 400 సీట్లు గెలుస్తుందని తేల్చేశాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 150లోపే ఆగిపోతుందని చెప్పా యి. కానీ, ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలన్నీ అబద్ధమని తేలిపోయింది.  ఎన్డీయే కూటమి 291 సీట్లకే పరిమితమైంది. బీజేపీ సొంతంగా మ్యాజిక్ మార్కు 272 సీట్లు కూడా చేరుకోలేకపోయింది. ఇప్పుడు మరోసారి కేంద్రం లో ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే ఆ పార్టీకి ఎన్డీయే పక్షాల మద్దతు తప్పనిసరి అయ్యింది.

ప్రస్తుత పరిస్థితుల్లో 16 ఎంపీ సీట్లు గెలిచిన టీడీపీ, 14 చోట్ల విజయం సాధించిన జేడీయూ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయటంలో కీలకంగా మారనున్నాయి. ఎన్నికలముందు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన అయోధ్య రామమందిరం బీజేపీకి ఓట్లు రాల్చలేకపోయింది. రామమందిరం నెలకొని ఉన్న నియోజకవర్గంలో కూడా బీజేపీ ఓడిపోవటం గమనార్హం. 2019 ఎన్నికల్లో యూపీలో దాదాపు క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ కూటమికి.. ఈసారి దారుణమైన ఓటమి తప్పలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమి 37 సీట్లతో సరిపెట్టుకోగా.. కాంగ్రెస్, ఎస్పీ కూటమి 42 స్థానాల్లో విజయం సాధించి అనూహ్యంగా పుంజుకొన్నది. 

పుంజుకున్న ఇండియా కూటమి 

యూపీఏ విచ్చిన్నమైన తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమిని ఏర్పాటుచేసినప్పుడు దేశంలో ఎవరూ పెద్దగా దానిని పట్టించేకోలేదు. మొదటి ఆ కూటమిలో చేరిన తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీలు మధ్యలోనే బయటకు వెళ్లిపోవటంతో ఇక ఇండియా కూటమి పని అయిపోయిందని అంతా భావించారు. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు కూడా అదే చెప్పాయి. కానీ, ఫలితాల్లో ఆ కూటమి అధికారంలోకి రాగల మెజారిటీ సాధించలేకపోయినా.. అద్భుతంగా పుంజుకొన్నది. కాంగ్రెస్ పార్టీ సొంతంగా 99 చోట్ల విజయం సాధించింది. మొత్తంగా ఆ కూటమి 233 సీట్లు గెలుచుకొని లోక్‌సభలో ఎన్డీయే ఆధిపత్యానికి గండి కొట్టింది. ఈ రెండు కూటముల్లో లేని పార్టీలు 19 చోట్ల విజయం సాధించారు. మోదీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లను రద్దుచేస్తారని ఇండియా కూటమి నేతలు ప్రచారం ఎన్డీయే, బీజేపీని బాగా దెబ్బతీసినట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 

యూపీలో ఎస్పీ, ద్రవిడంలో డీఎంకే

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, తమిళనాడులో అధికార డీఎంకే సత్తా చాటాయి. ముఖ్యంగా యూపీలో బీజేపీ గుత్తాధిపత్యానికి అఖిలేశ్ యాదవ్ గండికొట్టారు. రాష్ట్రంలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాలకు గాను 2019లో బీజేపీ 61 సీట్లు గెలుచుకోగా, ఈసారి 33 స్థానాలకు పడిపోయింది. గత ఎన్నికల్లో 10 సీట్లు గెలిచిన బీఎస్పీ ఈసారి ఖాతా కూడా తెరువలేకపోయింది. అధికార బీజేపీకి గట్టి షాకిస్తూ ఎస్పీ ఏకంగా 37 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 6 స్థానాలు దక్కించుకొన్నది.  కాంగ్రెస్ పార్టీకి కంచుకోటల్లాంటి అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలు రెండూ మళ్లీ ఆ పార్టీ ఖాతాలో చేరాయి. తమిళనాడులో అధికార డీఎంకే మరోసారి తన ఆధిపత్యం చాటింది. రాష్ట్రంలో ఇండియా కూటమి దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 39 స్థానాలకు గాను, ఇండియా కూటమి 38 చోట్ల విజయం సాధించింది.

మహారాష్ట్ర, కర్ణాటకలో బీజేపీ కూటమికి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. గత ఎన్నికలతో పోల్చితే సీట్లు సగానికి సగం తగ్గిపోయాయి. వంగదేశం బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) హవా కొనసాగింది. రాష్ట్రంలోని 42 స్థానాలకు గాను టీఎంసీ 29 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 12 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ ఒకచోట గెలిచింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో ఆమ్‌ఆద్మీ పార్టీ గట్టి ప్రభావం చూపుతుందని భావించినప్పటికీ మూడు సీట్లకే ఆ పార్టీ పరమితమైంది.

రెండుచోట్ల గెలిచిన రాహుల్

ఈసారి ఎన్నికల్లో సంచలనాలేమీ నమోదు కాలేదు. ప్రధాని నరేంద్రమోదీ యూపీలోని వారణాసిలో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో వెనుకబడినట్టు కనిపించినా ఆ తర్వా పుంజుకొని గట్టెక్కారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ యూపీలోని రాయ్‌బరేలీతోపాటు కేరళలోని వయనాడ్‌లో కూడా గెలిచారు. గత ఎన్నికల్లో అమేథీలో రాహుల్‌ను ఓడించిన బీజేపీ నేత సృ్మతి ఇరానీ.. ఈసారి కాంగ్రెస్ నేత కిశోరీలాల్ చేతిలో ఓడిపోయారు. కేంద్ర మంత్రులు నితిన్‌గడ్కరీ, పీయూష్‌గోయల్, అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ కూతురు సుప్రియా సూలే తదితరులు విజయం సాధించారు.

పాతాళం నుంచి పడిలేచిన కెరటాలు

తాజా ఎన్నికల ఫలితాల్లో అందరి దృష్టిని ఆకర్శించినది టీడీపీ, జనసే, జేడీయూ పార్టీలే. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ, జనసేన పార్టీలు.. అద్భుత విజయంతో పడిలేచిన కెరటాల్లా దూసుకుపోయాయి. చంద్రబాబు పని అయిపోయిందని అనుకొన్న తరుణలంలో తన పార్టీని ఏకంగా 136 చోట్ల గెలిపించుకొని మరోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించబోతున్నారు. గత ఎన్నికల్లో ఖాతా తెరువలేకపోయిన సినీనటుడు పవన్‌కల్యాన్ నేతృత్వంలోని జనసేన పార్టీ.. ఈసారి 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి అన్ని చోట్లా విజయం సాధించి రికార్డు సృష్టించింది.

టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడితోపాటు జనసేన అధినేత పవన్‌కల్యాన్ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఉత్తరాదికి చెందిన బీహార్‌లో అధికారంలో ఉన్నప్పటికీ సీఎం నితీశ్‌కుమార్ బలం చాలావరకు తగ్గిపోయింది. లోక్‌సభ ఎన్నికలకు ముందువరకు ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని నడిపిన ఆయన.. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు బీజేపీతో జట్టుకట్టి ప్రభుత్వాన్ని నిలబెట్టుకొన్నారు. అయితే, బీజేపీ, ఆర్జేడీకంటే నితీశ్‌పార్టీ జేడీఎస్ బలహీనపడటంతో ఇక ఆయన పని అయిపోయిందని రాజకీయ పండితులు విశ్లేషించారు. కానీ, లోక్‌సభ ఎన్నికల్లో ఆయన  అనూహ్యంగా పుంజుకొన్నారు.