15 May, 2026 | 5:18 PM

పశువుల రవాణాపై అప్రమత్తంగా ఉండాలి

15-05-2026 04:02 PM

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

సుల్తానాబాద్, మే 15 (విజయ క్రాంతి): ఈ నెల 27న బక్రీద్ పండుగ ఉన్నందున పశువుల అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని రామగుండము పోలీస్ కమీషనర్  అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెద్దపల్లి జోన్ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిదిలోని దుబ్బపల్లి వద్ద ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ ను రామగుండము పోలీస్ కమీషనర్  అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి తనిఖి చేసి అధికారులకు సిబ్బందికి పలు సూచనలు ఆదేశాలు ఇచ్చారు.

వివరాలు నమోదు రిజిస్టర్లను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ... బక్రీద్ పండగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో పటిష్టమైన నిఘా పెట్టినట్లు సిపి అంబర్ కిశోర్ ఝా తెలిపారు. చెక్ పోస్ట్ వద్ద అమలులో ఉన్న భద్రత చర్యలను పరిశీలించి విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు.

పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రతి వాహనం, పశువుల వివరాలు రిజిస్టర్ లో నమోదు చేయాలనీ, సంబంధిత పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని ఆదేశించారు. అనుమానస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రివేళలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పండగ సమయంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని,అనుమానస్పద కార్యకలాపాల పై పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సిపి  వెంట పెద్దపల్లి ఏసిపి జి.కృష్ణ సుల్తానాబాద్ సిఐ రంజిత్, ఎస్సై చంద్రకుమార్ తదితరులు ఉన్నారు.