కోతుల బెడద నుంచి విముక్తి
మంచరామి సర్పంచ్ ఉప్పు లక్ష్మీ తిరుపతి దంపతులకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామి గ్రామంలో కొంతకాలంగా విపరీతంగా పెరిగిన కోతుల బెదడ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. కోతులు ఇళ్లలోకి చొరబడి వస్తువులను ఎత్తుకుపోవడం, పంటలను నాశనం చేయడం మాత్రమే కాకుండా, కొంతమందిపై దాడులు చేయడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. ఈ సమస్యను గమనించిన గ్రామ సర్పంచ్ ఉప్పు లక్ష్మీ తిరుపతి ప్రజల కష్టాలను చూసి వెంటనే చర్యలు చేపట్టారు. సంవత్సరం క్రితం కరీంనగర్ నుండి ఒక కొండేంగాను తెప్పించి, కోతులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వదిలారు.
దీంతో కోతులు సుమారు ఆరు నెలల పాటు గ్రామాన్ని విడిచి వెళ్లాయి.అయితే తిరిగి కోతుల బెదడ మొదలవడంతో, తిరుపతి లక్ష్మీ మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. నెల్లూరి నుండి కోతులను పట్టే నిపుణులను పిలిపించి, స్వంత నిధుల నుంచి సుమారు రూ.25,000 ఖర్చు చేసి గత సంవత్సరం అక్టోబర్‌లో దాదాపు 50 కోతులను పట్టించి చెన్నూరు అడవిలో వదిలించారు. ఆ సమయంలో వారికి ఎలాంటి అధికార పదవి లేకపోయినా, సమాజ సేవ కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తరువాత జరిగిన ఎన్నికల ప్రచారంలో మిగిలిన కోతులను కూడా పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చిన తిరుపతి లక్ష్మీ తన టీమ్‌తో కలిసి వినూత్న చర్యలు చేపట్టారు. చింపాంజీ వేషధారణలో వ్యక్తులను పంపించి కోతులను భయపెట్టి గ్రామం నుంచి తరిమివేయడం జరిగింది. ప్రస్తుతం గ్రామంలో కేవలం ఒకటి రెండు కోతులు మాత్రమే మిగిలి ఉండగా, గ్రామం దాదాపు కోతుల బెదడ లేదు,గ్రామాన్ని కోతుల సమస్య నుంచి కాపాడిన సర్పంచ్ ఉప్పు లక్ష్మీ తిరుపతి లకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ టీమ్ సభ్యులందరికీ గ్రామస్థులు అభినందనలు తెలియజేశారు.




