17 June, 2026 | 1:12 AM

విద్యాభివృద్ధికి ఇచ్చిన హామీలను నేరవేర్చాలి

17-06-2026 12:08 AM

ప్రభుత్వ బడులను మూసివేయొద్దు

తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క

ముషీరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): విద్య అభివృద్ధికి ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే నేరవేర్చాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు  విమలక్క డిమాండ్ చేశారు. ప్రజలకు ప్రధానంగా విద్యా, వైద్యం ప్రభుత్వాలు సమాకూర్చితే ఏ సంక్షేమ పధకాలతో అవసరం ఉండదని అన్నారు.

తల్లుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర కన్వినర్ భాగ్యలక్ష్మి తోకలసి ఆమె మాట్లాడారు. ప్రభుత్వ బడిలో చదివి ఈ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డి నేడు పేదలకు విద్యను దూరం చేసేలా ప్రభుత్వ బడులనే మూసీ వేస్తామనడం సరికాదని, ఆ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

చాలా ఏళ్లుగా పేదలకు విద్య దూరం అవుతుందని, కనీసం ఇప్పుడైనా వెసులుబాటు కలుగుతుందని అనుకునే తరుణంలో బడుల మూసివేతకు పూనుకోవడం అందోళనకరం అన్నారు. గ్రామాల్లో కమిటీలు వేసుకుని ప్రభుత్వ బడులను అభివృద్ధి చేసుకోవాలని కంకణం కట్టుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ బడుల అభివృద్ధి కోసం మేధావులను విద్యా పరిరక్షణ కమిటీ సభ్యులను, టీచర్లను, తల్లుల సంఘం ప్రతినిధులను, ప్రజా సంఘాలను ఆహ్వానించి ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలన్నారు. సంఘం ప్రతినిధులు లలిత, రాధ, విజయలక్ష్మి, లావణ్య, సాయిలక్ష్మి, శోభ, అనిత పాల్గొన్నారు.