బిజినేపల్లిలో విద్యుత్‌లో ఓల్టేజ్ సమస్యలు
కాలిపోయిన మొక్కజొన్న పంటలు, వీధి దీపాలు
బిజినేపల్లి మే 3: లో ఓల్టేజ్ సమస్యల కారణంగా మండలంలోని ఆయా గ్రామాల్లో మొక్కజొన్న పంటలు, గ్రామాల్లోని వీధి దీపాలు కాలిపోయాయి. ఈ ఘటనలు ఆదివారం ఉదయం నుండి చోటు చేసుకున్నాయి. మండలంలోని అల్లిపూర్ గ్రామంలో డొక్కా శ్రీనివాసులు అనే రైతుకు చెందిన 2.5 ఎకరాల భూమిలో ట్రాన్స్ ఫారం ఉన్నందున నిప్పు రవ్వలు పడి మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. దీంతో 1.5 లక్షల వరకు పంట నష్టం జరిగి ఉండొచ్చని గ్రామస్తులు అంచనా వేస్తున్నారు.
వట్టెం గ్రామంలో ఓల్టేజ్ కారణంగా 75 వరకు వీధి దీపాలు కాలిపోయాయి. గృహాల్లో కూడా ఫ్రీజ్జులు, టివిలు కూడా కాలిపోయినట్టు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో చాలా రోజుల నుండి ఓల్టేజ్ సమస్య ఉందని సర్పంచి పిట్టల జ్యోతి విద్యుత్తు అధికారుల దృష్టికి తీసుకెళ్ళిందని, స్థానిక లైన్ మెన్ బాధ్యతా రాహిత్యంతో విధులు నిర్వహిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నంది వడ్డేమాన్ గ్రామంలో కర్రెన్నగారి వేముల స్వామి అనే రైతుకు చెందిన 5 ఎకరాల మొక్కజొన్న పంట ఆదివారం మధ్యాహ్నం కాలి పోయింది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాకున్నా, 3 లక్షల వరకు పంట నష్టం జరిగినట్లు రైతు తెలిపారు.






