ఓటరు సవరణ పారదర్శకంగా నిర్వహించాలి
సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహ రెడ్డి
కడ్తాల్, జూన్5,(విజయ క్రాంతి ): రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేపట్టబోతున్న ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులను కోరారు.
ముఖ్యంగా ఓటరు జాబితా తయారీ, సవరణ దశల్లో ఎటువంటి లోపాలు లేకుండా అన్ని పార్టీలకు సమాన సమాచారం అందించాలని వారు కోరారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ తరఫున బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహ రెడ్డి ఇతర నాయకులతో కలిసి వినతి పత్రాన్ని జిల్లా అధికారి ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డికి అందజేశారు. ఓటరు జాబితా సవరణలో గ్రామ స్థాయి నుంచి డేటా సేకరణ వరకు ప్రతి దశను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆయన కోరారు.
ఓటర్ల పేర్లు తొలగింపు లేదా కొత్త నమోదు ప్రక్రియలో ఎటువంటి పక్షపాతం చోటుచేసుకోకూడదని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లకు సరైన సమాచారం, సహకారం అందించాలని కూడా వారు కోరారు. జిల్లా అధికారులు అన్ని సూచనలను పరిశీలించి, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా ప్రక్రియ నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో మాడ్గుల మండల బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏమిరెడ్డి జైపాల్ రెడ్డి, నాయకులు పుట్ట రాంరెడ్డి, సయ్యద్ ఖలీల్ , రామిడి రాంరెడ్డి,చుక్కా నిరంజన్, దోనాదుల కుమార్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






