వృషకర్మ నా కెరీర్‌లోకెల్లా ఉత్తమ చిత్రం
నాగచైతన్య కథానాయకుడిగా దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. ఈ చిత్రాన్ని ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మీనాక్షి చౌదరి కథానాయిగా నటిస్తున్న ఈ సినిమాలో స్పర్ష్ శ్రీవాస్తవ, జయరామ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ గురువారం లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఈవెంట్‌లో నాగచైతన్య మాట్లాడుతూ.. “కార్తీక్ చెప్పినట్టు ‘వృషకర్మ’ నా కెరీర్‌లో 100% బెస్ట్ మూవీ కాబోతుంది. ఇంత పెద్ద స్కేల్‌లో మిథికల్ థ్రిల్లర్ చేయాలని ఎప్పటినుంచో ఉంది. ఆ కోరిక ఈ సినిమా తో తీరింది. స్క్రిప్ట్ విన్నప్పుడే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. కార్తీక్ బ్రిలియంట్ ఫిలిం మేకర్. ఆయన అనుకున్నది 100% అచీవ్ చేశారు. కార్తీక్ గురించి లైఫ్ లాంగ్ మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకంటే తన అంత మంచి సినిమా ఇచ్చాడు. అంచనాలన్నిటిని ఈ సినిమా అందుకుంటుంది. ఈ సినిమా చివరి 30 నిమిషాలు క్లైమాక్స్ ఇండియన్ సినిమాలో ఒక బెంచ్ మార్క్ అవుతుంది.
అది నా ప్రామిస్. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమాను రూపొందించారు” అన్నారు. డైరెక్టర్ కార్తీక్ దండు మాట్లాడుతూ.. “విరూపాక్ష’ సినిమాను ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు. ఇప్పుడు మరింత గొప్ప సినిమా తీసే అవకాశాన్ని కూడా వాళ్లే ఇచ్చారు. తాను పనిచేసే హీరోతో వాళ్ల కెరీర్ బెస్ట్ ఫిలిం ఇవ్వాలని ప్రతి దర్శకుడికీ ఉంటుంది. చైతన్యకు నేనే బెస్ట్ ఫిలిం ఇస్తున్నా. ఈ సినిమాలో ప్రేక్షకులు కొత్త నాగచైతన్యను చూస్తారు. అన్ని పాత్రలూ చాలా కొత్తగా ఉంటాయి. స్పర్శ్ చేస్తున్న క్యారెక్టర్ మామూలుగా ఉండదు” అని చెప్పారు. సంగీత దర్శకుడు అజినిష్, నటుడు స్పర్శ్ శ్రీవాస్తవ, ప్రొడక్షన్ డిజైనర్ శ్రీనాగేంద్ర కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.




