సీపీఎం పార్టీకి వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వేలాది పద్మావతి రాజీనామా
కోదాడ,(విజయ క్రాంతి): సీపీఎం పార్టీలో ఉపాధి హామీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న వేలది పద్మావతి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అలాగే అన్ని పార్టీ బాధ్యతలకు శుక్రవారం రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం సీపీఎం పట్టణ కార్యదర్శి ముత్యాలుకు ఆమె రాజీనామా లేఖను అందజేశారు. రాజీనామా లేఖలో పద్మావతి మాట్లాడుతూ, సీపీఎం పార్టీలో పనిచేసిన కాలంలో పార్టీ బాధ్యతలను అత్యంత నిబద్ధతతో నిర్వహించానని పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేశానని, ముఖ్యంగా భూమిలేని పేదలకు ఇళ్ల స్థలాలు, గృహాల కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించానని తెలిపారు. అయితే, ఇటీవల కాలంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని, పార్టీ బాధ్యతలు సక్రమంగా నిర్వహించుకునే పరిస్థితి లేకపోవడంతో పాటు వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో వెల్లడించారు. ఇప్పటి వరకు తనతో కలిసి పనిచేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.






