6 June, 2026 | 8:03 PM

ఇంటి వద్దనే చెత్తను వేరు చేయాలి

06-06-2026 06:49 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ప్రతి ఇంట్లో చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి వేయాలని తద్వారా పరిసరాల పరిశుభ్రతతో పాటు పర్యావరణాన్ని కాపాడిన వారమవుతామని మూకమామిడి సర్పంచ్ కొర్సా ఆదిలక్ష్మి అన్నారు. శనివారం ములకలపల్లి మండలం మూకమామిడి గ్రామపంచాయతీ లో సర్పంచ్ కొర్సా ఆదిలక్ష్మి అధ్యక్షతన ఘన వ్యర్ధాల నిర్వహణ నియమాలు 2026 లో భాగంగా నాలుగు రకాల వ్యర్ధాల విధానంపై గ్రామసభను నిర్వహించారు. ఈ గ్రామసభను ఉద్దేశించి సర్పంచ్ ఆదిలక్ష్మి మాట్లాడుతూ... ప్రతి ఇంట్లో చెత్తను తప్పనిసరిగా నాలుగు రకాలుగా వేరు చేసి వేయాలని తెలిపారు.

ఇది పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నాలుగు రకాల చెత్త పై వివరిస్తూ తడి చెత్త అంటే వంటింటి చెత్త,కూరగాయల తొక్కలు,ఆహార అవశేషాలు,పూలు,టీ-కాఫీ పొడిని ఇందులో వేయాలని ఈ చెత్తను కంపోస్ట్,బయోగ్యాస్ తయారీకి వాడతాని చెప్పారు. పొడి చెత్త అంటే ప్లాస్టిక్, కాగితం, గాజు, లోహ పదార్థాలు, గట్టి ప్లాస్టిక్ వస్తువులు ఇందులో వస్తాయని వీటిని రీసైక్లింగ్ కోసం పంపుతారని తెలిపారు. శానిటరీ చెత్త అంటే డైపర్లు, సానిటరీ నాప్కిన్స్, మెడికల్ వాడిన వస్తువులను పేపర్లో కట్టి ఇందులో వేయాలని సూచించారు. వీటిని ప్రత్యేకంగా సేకరించి సురక్షితంగా నాశనం చేస్తారు.

హానికర చెత్త అంటే బల్బులు, బ్యాటరీలు, మందులు, ఈ-వేస్ట్, పెయింట్లు వంటి హానికర పదార్థాలు ఈ పరిధిలోకి వస్తాయని వివరించారు.వీటిని ప్రత్యేక విధానంతో పారవేస్తారని చెత్తను కలిపి వేస్తే సిబ్బందికి ఇబ్బందికరంగా ఉంటుందని ఇంటి వద్దే చెత్తను వేరు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని చెత్త వేరు చేస్తేనే ఆరోగ్యం,పర్యావరణ రక్షితం అన్నారు.రాబోయే వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పంచాయతీలో జరుగు పనులపై, చేయవలసిన కార్యక్రమాలపై ప్రజలకు వివరించడం జరిగింది.

చేయవలసిన కార్యక్రమాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అనంతరం ప్రజలు గ్రామసభలో తీసుకొని వచ్చిన దరఖాస్తులను స్వీకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ నుండి మండల వ్యవసాయ అధికారి అరుణ్ బాబు, ఎన్ఆర్ఈజీఎస్ నుండి టెక్నికల్ అసిస్టెంట్ తాటి సత్యం,ఐకెపి నుండి సిసి కే వెంకటేశ్వర్లు,విద్యాశాఖ నుండి మొగరాలగుప్ప పాఠశాల హెచ్ఎం స్వరూప భవాని,రెవిన్యూ డిపార్ట్మెంట్ నుండి జిపిఓ నరసింహారావు,అంగన్వాడి నుండి టీచర్ రవ్వ వసంత మాట్లాడారుఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కురుసం సీత వార్డు సభ్యులు పాల్గొన్నారు.