వైద్యులు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
- సీపీ రష్మీ పెరుమాళ్
సిద్దిపేట క్రైం: వైద్యులు, పోలీసులు 24 గంటలు ప్రజల కోసమే శ్రమిస్తారని, నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఈ రెండు రంగాలపై ఉందని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సిద్దిపేట జిల్లా షీటీం ఆధ్వర్యంలో సురభి మెడికల్ కాలేజీలో విద్యార్థులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని సాధ్యమైనంత తక్కువగా పంచుకోవాలని సూచించారు. విద్యార్థులు ర్యాగింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన వాతావరణంలో చదువుకోవాలని హితవు పలికారు. సిద్దిపేటలో డ్రగ్స్ డీఅడిక్షన్ సెంటర్ అందుబాటులో ఉందని, ఎవరైనా వ్యసనపరులు ఉంటే అక్కడ చేర్పించేలా సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం ఎంబీబీఎస్, నర్సింగ్ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎలా ఫిర్యాదు చేయాలి, క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనే విషయాలను వివరించారు.






