10 March, 2026 | 3:36 AM

ప్రత్యామ్నాయ మార్గాల్లో జలాలు అందించాలి

10-03-2026 02:00 AM

మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో ప్రస్తుత సాగునీటి ఎద్దడి నెలకొంది. ఆరుగాలం శ్రమపడి రైతులు పండించిన  పంటలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు పడిపోవడం ఎద్దడికి ప్రధాన కారణం. పంట కాల్వల ద్వారా నీటి సరఫరా నిలిచిపోవడంతో చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయాయి. దీనివల్ల బోర్లలో నీటి మట్టం తగ్గిపోయి పొట్ట దశలో ఉన్న వరి, మక్కజొన్న పంటలకు నీరు అందడం లేదు.

గతంలో ప్రాజెక్టుల నుంచి నిరంతరాయంగా నీరు అందడం వల్ల రైతులు ధైర్యంగా సాగు చేసేవారు. ప్రభుత్వం సాగునీటి నిర్వహణను పట్టించుకోకపోవడం, కాల్వల్లో పూడిక పేరుకుపోవడం వల్ల చివరి ఆయకట్టు వరకు నీరు చేరడం లేదు. ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకపోవడం వల్ల రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. జనగామ జిల్లాలో దేవాదుల నీటిపై ఆధారపడిన రైతులు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

స్టేషన్ ఘన్‌పూర్ రిజర్వాయర్ నుంచి చెన్నూరు కాల్వకు నీరు విడుదల చేయకపోవడం వల్ల సాగు భూములు నెర్రెలు వారుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, నర్సింహులపేట మండలాల్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కాళేశ్వరం జలాలు రాకపోవడంతో మున్నేరు, ఆకేరు వాగుల పరీవాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, చెరువులు నింపే చర్యలు చేపట్టకపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించిం యుద్ధ ప్రాతిపదికన పంటలకు సాగు జలాలు అందేలా చర్యలు తీసుకోవాలి. దేవాదుల, ఎస్సార్ ఎస్పీ కాల్వల నుంచి సాగునీటిని విడుదల చేసి చెరువులు, కుంటలను నింపాలి. కాల్వల వెంట పేరుకుపోయిన పూడికను తొలగించాలి. నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలి. అలా చేస్తేనే రైతులు గట్టెక్కుతారు.

 రాజయ్య, మహబూబాబాద్