మాదకద్రవ్యాలను సమాజానికి దూరం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
డ్రగ్స్, మత్తు పానీయాలు సేవించడం వ్యాధి కంటే ప్రమాదకరం
ప్రజల సహకారంతో గంజాయి రహిత సమాజమే లక్ష్యం.. పోలీస్ కమిషనర్ సునీల్ దత్
డ్రగ్స్ బారిన పడినట్లు అనుమానం వస్తే 1908 కు సమాచారం అందించాలి
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్
ఖమ్మం,(విజయక్రాంతి): మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, బాధ్యతగా కృషి చేయాలని, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం ఖమ్మం నగరం మమత రోడ్డు లోని వివిసి టాటా సర్వీస్ సెంటర్ నుంచి లాకారం ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి ప్రారంభించారు. విద్యార్థులు, యువత, పోలీస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తో కలిసి రన్ లో కలెక్టర్, పోలీస్ కమిషనర్ లు పాల్గొని స్పూర్తినిచ్చారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో యువత పాత్ర చాల కీలకమని, యువతకు ఉపాధి కల్పన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నిధులు కేటాయిస్తూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే తక్షణమే అప్రమత్తం కావాలని అన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకోవాలని, మాదకద్రవ్యాలు, మత్తు పానీయాలు సేవించడం వ్యాధి కంటే ప్రమాదకరమని వివరించారు.
డ్రగ్స్ వాడకం వల్ల ఒకరి జీవితం మాత్రమే ప్రభావితం కాదని, కుటుంబం, సమాజాన్ని నాశనం చేస్తుందని అన్నారు. డ్రగ్స్ నియంత్రణ కేవలం అధికారులు మాత్రమే చేయలేరని, ప్రజలంతా సమిష్టిగా ఉంటూ అధికారులకు సహకరిస్తేనే మెరుగైన ఫలితాలు లభిస్తాయని కలెక్టర్ తెలిపారు. డ్రగ్స్ వాడకం ప్రారంభించకముందే మనమంతా మేల్కొనాలని, యువత డ్రగ్స్ వంటి వాటి వైపు వెళ్లకుండా దూరంగా ఉండాలని, తమ ఉజ్వల భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. మాదక ద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, ఆరోగ్యశాఖ, మాదకద్రవ్య నివారణ సంస్థలు, సమాజం అందరూ కలిసి సమష్టిగా చైతన్యం పెంచినప్పుడే మాదకద్రవ్యాల ప్రమాదం నుంచి దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందించగలుగుతామన్నారు.
పోలీస్ కమీషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరు భాగస్వాములై భావితరాలకు మంచి భవిష్యత్ అందించాలని అన్నారు. యువత దృష్టి అంతా జీవిత లక్ష్యంపై మాత్రమే ఉండాలని, నిషేధిత గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్ధాలకు విద్యార్ధులు ఆకర్షితులు కావద్దని సూచించారు. గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడితే మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పాడు చేస్తుందన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన, గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా పోలీసుశాఖ కృషి చేస్తుందన్నారు.
ఇందులో భాగంగానే విద్యాసంస్థలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తునమన్నారు. ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తుపదార్థాలు విక్రయిస్తున్నట్లు, తాగుతున్నట్లు తెలిస్తే వెంటనే 1908 కు సమాచారం అందించాలన్నారు. మీ వివరాలు గోప్యం గా ఉంచడం జరుగుతుందని అన్నారు. అనంతరం ప్రజలు, యువత, విద్యార్థులు, అధికారులతో కలిసి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం పై ప్రతిజ్ఞ చేశారు. తర్వాత "ఐయామ్ యాంటీ డ్రగ్ సోల్జర్స్" సెల్ఫ్ పాయింట్ వద్ద ఫోటోలు దిగడంతో పాటు సైన్ బోర్డు వద్ద సంతకాలు చేసి మాదకద్రవ్యాల నిర్మూలనకు తమ మద్దతు తెలిపారు.






