26 June, 2026 | 5:03 PM

అల్లుడి పేర పొలం చేయలేదని.. భర్త ప్రాణం తీసిన భార్య,!

26-06-2026 04:28 PM

- భర్తతో పాటు కూతురు, అల్లుడు అరెస్ట్

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్‌ కర్నూల్ జిల్లాలో ఆస్తి వివాదం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. ఆవంచ గ్రామానికి చెందిన యాదయ్య (54)ను హత్య చేసిన కేసులో అతని భార్య అలివేల, కుమార్తె పద్య, అల్లుడు ఆంజనేయులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం... 1:20గుంటల భూమిని అల్లుడు పేర పట్టా చేయాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయగా, యాదయ్య నిరాకరించడంతో కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో జూన్ 23న ముగ్గురు కలిసి యాదయ్యపై దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.

హత్యను సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ, అంత్యక్రియలకు ముందు మృతదేహానికి స్నానం చేయించే సమయంలో గాయాలను గుర్తించిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను శుక్రవారం నాగర్‌ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు వెల్లడించారు. అరెస్టు ప్రక్రియలో సీఐ అశోక్ రెడ్డి, తిమ్మాజిపేట ఎస్సై శ్రీనివాసరావు పాల్గొన్నారు.