అండర్ పాస్లో నిలిచిన నీరు..వాహనదారుల ఇక్కట్లు..
సూర్యాపేట (మఠంపల్లి) జులై 5 : మండల కేంద్రంలో ఉన్న రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా బ్రిడ్జి కిందకు వర్షపు నీరు తరచుగా నిలిచిపోవడంతో తీగలు చెరువు,అవిరేనికుంట తండా, కొత్త దొనబండ తండా,రఘునాథ పాలెం, గుండ్లపల్లి, కిష్టాపురం చింత్రియాల గ్రామాలకు వెళ్లే ప్రజలు,విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిపాటి వర్షానికే అండర్ పాస్ పూర్తిగా నీటి కుంటలా తలపిస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు ,పాదచారులు రాకపోకలు సాగించలేక అవస్థలు ఎదుర్కొంటున్నారు.అండర్పాస్ వద్ద సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడం వలన చిన్నపాటి వర్షానికి నీరు నిలుస్తోందని ఆరోపిస్తున్నారు.
దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై రైల్వే అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా సంబంధిత రైల్వే అధికారులు,కాంట్రాక్టర్ స్పందించి నీరు బయటకు వెళ్లేలా శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, అండర్ పాస్లో నిలిచిన నీటిని వెంటనే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు.ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






