13 May, 2026 | 2:13 AM

ముళ్లకంచెలకు భయపడం

13-05-2026 01:13 AM
  1. భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోం
  2. మా జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటాం
  3. బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు ఎం.హెచ్.కబీర్

ఢాకా, మే 12: తమదేశ జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని బంగ్లాదేశ్ విదేశాంగశాఖ సలహాదారు ఎం.హెచ్.కబీర్  పేర్కొన్నారు. ముళ్లకంచెలకు భయపడబోమన్నారు. భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదన్నారు. ఢాకాలో మంగళవారం నిర్వహించిన బంగ్లాదేశ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ అనే కార్యక్రమంలో విదేశాంగశాఖ సలహాదారు ఎం.హెచ్.కబీర్  పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. బీజింగ్, న్యూఢిల్లీలతో బంగ్లాదేశ్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుడుకుంటూనే ఆ రెండు దేశాలతో సమతుల్య సంబంధాలను కొనసాగిస్తుందన్నారు. అవసరమైతే భారత్‌తో చర్చలు జరుపుతామన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితులను గమనిస్తున్నామని చెప్పారు. 

తమ సంబంధాలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంతోనే ఉంటాయన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరిచేందుకు ఇరుదేశాల నాయకత్వం కట్టుబడి ఉందన్నారు. కాగా అధికారంలోకి వచ్చిన తరువాత 45 రోజుల్లో బంగ్లాదేశ్ వెంబడి ఉన్న సరిహద్దుల్లో కంచె నిర్మాణం చేపడతామని బీజేపీ తేల్చి చెప్పింది. ఆ దిశగా సీఎం సువేందు అధికారి తొలిమంత్రివర్గ భేటీలో బీఎస్‌ఎఫ్‌కు భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.