13 August, 2026 | 7:02 PM

వర్గల్‌ ఎంపిజే కళాశాలలో ఘనంగా విద్యార్థి నాయకత్వ ఎన్నికలు

13-08-2026 05:28 PM

గజ్వేల్: మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాల, వర్గల్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి విద్యార్థి నాయకత్వ ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించారు. కళాశాల ప్రజా నాయకుడు, క్రీడల నాయకుడు, వసతి గృహ నాయకులు, క్రమశిక్షణ నాయకుడు, సాంస్కృతిక నాయకుడు తదితర 15 పదవులకు ఎన్నికలు జరిగాయి.

సుమారు 800 మంది విద్యార్థుల సమక్షంలో అభ్యర్థులు తమ లక్ష్యాలు, ప్రణాళికలను వివరించగా, బ్యాలెట్‌ బాక్స్‌ పద్ధతిలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించారు. అనంతరం ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు. ఎన్నికల కోర్‌ కమిటీ సభ్యులు ఉష, చందన, గోవిందరావు ఆధ్వర్యంలో పోలింగ్‌ ప్రక్రియ పారదర్శకంగా జరిగింది.

ఆగస్టు 15న నూతన విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డా. జి. భాస్కర్‌రావు మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు, బాధ్యత, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించుకోవాలని సూచించారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన సిబ్బంది, విద్యార్థులను అభినందించారు.